జిల్లా కేంద్రాలకూ విమానాలు

0
20

ప్రస్తుతం తెలంగాణలో ఏ ప్రాంతంవారైనా ఇతర రాష్ర్టాలకో, ఇతర దేశాలకో విమానంలో ప్రయాణించాలంటే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి రాకతప్పని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇది సమీప భవిష్యత్తులో మారిపోనుంది. స్థానికంగా ఎక్కడికక్కడ విమాన సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమైన జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ దిశగా తొలి అడుగు పడింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ గత అక్టోబర్‌లో ప్రారంభించిన ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకంలో తెలంగాణ భాగమైంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీలతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూను) కుదుర్చుకున్నది. కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో ఒప్పందంపై కేంద్ర విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర సంతకాలు చేశారు. ఆర్థికంగా, సాంకేతికంగా అనువుగా ఉన్న పట్టణాల్లో విమానాశ్రయాలు ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా విమాన సేవల విస్తరణ, సామాన్యులకు అందుబాటులోకి పౌర విమాన సేవలు, ఆయాప్రాంతాల అభివృద్ధి వంటి పలురకాల ప్రయోజనాలు కలుగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here