జవదేకర్ కుమారుడి పెండ్లి రిసెప్షన్‌కు హాజరైన కేసీఆర్

0
30

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు కూడా ఉన్నారు. కుమారుడి వివాహ రిసెప్షన్‌కు తప్పకుండా హాజరుకావాలని ముందుగానే సీఎం కేసీఆర్‌తో జవదేకర్ మాట్లాడడంతో ఆ కార్యక్రమం కోసమే ఢిల్లీకి వచ్చారు. కేసీఆర్‌ను చూడగానే సంతోషం వ్యక్తంచేసిన జవదేకర్ కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కూడా సీఎం కేసీఆర్ ఐదు నిమిషాలపాటు విడిగా మాట్లాడారు. అక్కడికే వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్ ఐదు నిమిషాలపాటు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారని తెలిసింది. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను సత్వరం పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారని తెలిసింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని సంస్థల విభజన వ్యవహారాన్ని గవర్నర్ సమక్షంలో పరిష్కరించుకుంటామన్న ప్రతిపాదనను సైతం రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here