జగన్‌.. ఇదేం పద్ధతి

0
29

కృష్ణా జిల్లాలో ఇటీవల బస్సు ప్రమాదం సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌ వ్యవహరించిన తీరును రాష్ట్ర మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ పట్ల జగన్‌ ప్రవర్తించిన తీరు, వాడిన పరుష పదజాలం అభ్యంతరకరంగా ఉందని మంత్రిమండలి భావిస్తోంది. విధుల్లో ఉన్న అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు మర్యాదగా ప్రవర్తించే సంప్రదాయాన్ని జగన్మోహన్‌రెడ్డి విస్మరించడాన్ని మంత్రిమండలి తీవ్రంగా ఖండిస్తోంది’’ అని ఆ తీర్మానంలో మంత్రివర్గం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోను, అనంతరం శాసనసభలో అనుసరించాల్సిన తీరుపై జరిగిన పార్టీ వ్యూహ కమిటీ భేటీలోనూ జగన్‌ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కలెక్టర్‌తో జగన్‌ వ్యహరించిన తీరుకి సంబంధించిన వీడియో దృశ్యాలను మంత్రివర్గ సమావేశంలో ప్రదర్శించారు. ‘‘నిన్ను సెంట్రల్‌ జైలుకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాను’’ అని కలెక్టర్‌తో జగన్‌ అన్నట్టుగా కొందరు మంత్రులు పేర్కొన్నారు. కలెక్టర్‌ను తనతో పాటు సెంట్రల్‌ జైలుకి తీసుకెళతానని అన్నట్టుగా ఉందని ఒక మంత్రి, జగన్‌ తానే సెంట్రల్‌ జైలుకి వెళతాను అన్నట్టుగా ఉందని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని జగన్‌ నిస్పృహలో ఉన్నారని, అందుకే అర్ధంలేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యూహ కమిటీ సమావేశంలోను జగన్‌ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు…‘‘నేను, కేఈ కృష్ణమూర్తి, అశోక్‌ గజపతిరాజు 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. 1983 నుంచి యనమల కూడా ఉన్నారు. జగన్‌లాంటి ప్రతిపక్ష నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదు. వై.ఎస్‌. అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట్లాడేవారే తప్ప, అంతకు ముందు కొంత పద్ధతిగానే ఉండేవారు’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఒక మంత్రివర్గ సమావేశంలో విపక్ష నేతకు సంబంధించిన వీడియో చిత్రాలను చూసి, చర్చించడం ఇదే మొదటిసారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇష్టానుసారం మాట్లాడటం వల్లే.. రెండేళ్లుగా వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడటం వల్లే ప్రజల్లో పలచనయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్పష్టతతో ఉండాలని, సీనియర్‌ సభ్యులు ఏ అంశంపైనైనా దీటుగా మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రతి రోజు శాసనసభ సమావేశాలు ముగిశాక వ్యూహ కమిటీ కూర్చుని చర్చించాలని, తాను సైతం రోజూ గంట సమయం కేటాయిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశాలు ముగిశాక మర్నాడు జరిగే సభకు పక్కాగా సిద్ధం కావాలని తెలిపారు. వైకాపా ఇటీవల మాట్లాడుతున్న అంశాలు, ‘సాక్షి’ పత్రికలో వస్తున్న కథనాల్ని బట్టి చూస్తే… ఆ పార్టీ లేవనెత్తే అంశాలు 28 వరకు ఉంటాయని వ్యూహ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రధానంగా నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ వంటి అంశాల్ని వైకాపా ప్రస్తావించవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం పట్టిసీమ, పోలవరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి దీటుగా చెప్పాలన్న దానిపై చర్చ జరిగింది.

కేఈ, టీజీలకు క్లాస్‌..!: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ‘‘పార్టీ అభ్యర్థుల్ని గెలిపించలేకపోతే వూరుకోను. ఆ తర్వాత మీరు నా దగ్గరకు రావలసిన, నా నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి సహకారం లభించదు’’ అని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌లకు ముఖ్యమంత్రి క్లాస్‌ తీసుకున్నారు. కర్నూలు-కడప-అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కేజే రెడ్డిని వారే తీసుకొచ్చారని, ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల్లో సమర్థంగా ప్రచారం చేయడం లేదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘‘మీకు నేను ఎందుకు పనులు చేయాలి. మీ ఎన్నికల్లో మాత్రం అందరూ పనిచేయాలి. పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు కష్టపడరా?’’ అని పార్టీ నాయకుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది.

రోజాను అనుమతించాలా?: ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా శాసనసభ్యురాలు రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ గడువు పూర్తయిందని, ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు ఆమెను అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో వ్యూహ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అనిత జోక్యం చేసుకుంటూ.. క్షమాపణ కోరుతూ రోజా లేఖ రాసినా, ఆమెలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, రోజా తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై సమావేశాలు మొదలయ్యాక నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలిసిం

శాసనసభ 14 రోజులే..!: శాసనభ బడ్జెట్‌ సమావేశాలు 14 రోజులే జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 6న సమావేశాలు మొదలవుతున్నాయి. 6, 7 తేదీల్లో సమావేశాలు జరిగిన తర్వాత వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. మళ్లీ 13న బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

కొత్త సీఎస్‌కు స్వాగతం: మంత్రిమండలి సమావేశంలో కొత్త సీఎస్‌ అజేయకల్లంకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఎస్‌.పి.టక్కర్‌ సేవల్ని మంత్రివర్గం కొనియాడింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగానికి మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here