చేసి చూపించాం

0
24

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుంది. పార్లమెంటు తలుపులు మూసేసి విభజన బిల్లు ఆమోదించిన రోజు ఆవేశం వచ్చింది.. ఏ రోజు నేను అంత బాధపడలేదు. ఆ కోపాన్ని, అవమానాన్ని దిగమింగి శక్తి నిరూపిస్తానని శపథం చేశా. దాని ప్రకారమే చరిత్ర తిరగరాసేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తా. ప్రపంచాన్ని ఆకట్టుకునేలా దేశంలోనే అత్యున్నత రాజధానిగా రూపొందిస్తా. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన వారే అసూయపడేలా తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండేళ్లలోనే తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మించి తాము చేయగలమని నిరూపించుకుంటున్నామని అన్నారు. వెలగపూడిలో శాసనసభ, మండలి సంయుక్త సభల తాత్కాలిక భవన సముదాయాన్ని గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు గంటన్నరపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన వరకు, ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటివరకు తన రాజకీయ ఎదుగుదలను వివరించారు. అమెరికాలో ప్రస్తుతం తెలుగువాళ్ల ఇబ్బందులు, ప్రపంచంలోని ఘనమైన రాజధానులు, హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి తాను చేసిన కృషి, రాష్ట్రంలోని పథకాలు, అమరావతి ఎంపిక, భూసమీకరణ, విపక్షం తీరు.. ఇలా పలు అంశాలను ప్రస్తావించారు.

‘ఇది చరిత్రాత్మకం. ఒక వైపు బాధ, మరో వైపు అనందం. నిన్నటివరకు ఇది పొలం. ఇప్పుడు అసెంబ్లీ. ఈ రోజు నుంచి సొంతగడ్డపై నుంచే శాసనాలు చేసుకుంటాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాకు ప్రజలే హైకమాండ్‌. దిల్లీకి ఎప్పుడూ భయపడలేదు. ఎప్పుడూ తెలుగుజాతి కోసమే ఆలోచించా. నాడు ఐటీని అందిపుచ్చుకున్నాం. నా ఫైళ్లు పట్టుకుని నేనే తిరిగా. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తెచ్చాం. నా స్వార్థం కోసం ఇదంతా చేయలేదు. తెలుగుజాతి కోసం చేశా. నేను చనిపోయాక ఇవి గుర్తుంచుకుంటారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతిపక్షం వచ్చి ఉంటే బాగుండేది: రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే సంతోషంగా ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు. విపక్షాలు ఎన్ని కుతంత్రాలు పన్నినా సాగవని, ఆదర్శ పాలన అందిస్తానని, ప్రతి నిమిషం రాష్ట్ర ప్రయోజనాలకే పనిచేస్తానని పునరుద్ఘాటించారు. కలిసి వస్తే కలుపుకొని వెళ్తానని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పైకి తెస్తానని చంద్రబాబు అన్నారు. ‘రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటయింది. వేరే వాళ్లు ఎవరికైనా గుండెపోటు వచ్చేది. చనిపోయేవాళ్లు. లేదా నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి అనుభవిద్దాం అనుకునేవాళ్లు. ఈ పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేశామ’ని చంద్రబాబు చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో అగ్రవర్ణాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రజలంతా ఆలోచించాలి. సహకరించాలి. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సహకరించాలి.. ఆశీర్వదించాలంటూ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తొలుత స్వాగతం పలుకుతూ 192 రోజుల్లోనే శాసనసభ, మండలి తాత్కాలిక భవనాలు నిర్మించడం చరిత్రాత్మకమని అన్నారు. ఈ నెల 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పని చేస్తామని పేర్కొన్నారు. శాసనమండలి అధ్యక్షుడు చక్రపాణి తన ప్రసంగంలో పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల మాట్లాడుతూ ఈ ప్రాంతం విశిష్ఠ చరిత్రను తెలిసి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు మాట్లాడారు. ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలతో పాటు మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here