చేనేతకు మంచిరోజులొస్తున్నాయ్!

0
27

దశాబ్దకాలంగా చేతిలో నైపుణ్యం, మార్కెట్‌లో డిమాండ్. జాతీయ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు. కానీ చాలీచాలని కూలీ.. 24 గంటలు కష్టపడ్డా పొట్ట నింపని పని! ఆపై.. ఆకలి చావులు.. ఆక్రందనలు! ఒకటీ రెండేండ్లుకాదు.. 15 ఏండ్లుగా ఇదే దుస్థితి!! దీన్ని సమూలంగా మార్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. సమస్యలతో కునారిల్లుతున్న చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ త్వరలో సమగ్ర విధాన ప్రకటన చేయనున్నారన్న వార్త లక్షల మందిలో ఆసక్తి రేపుతున్నది.

ఆనాడే చేసి ఉంటే..

గత ప్రభుత్వాలు నిపుణులు, నేతలు, మాస్టర్ వీవర్లను పిలిచి రోజంతా చర్చించాయే తప్ప.. వాటిల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన పాపాన పోలేదు. నాడే ఆ చర్చలకు ఫలితాన్ని చూపించి ఉంటే ఇప్పుడీ దారిద్య్రం ఉండేది కాదన్న అభిప్రాయం చేనేత వర్గాల్లో నెలకొంది. కాలానికి తగ్గట్లుగా ఉత్పత్తులను తేవాలని కార్మికులకు సూచించకపోవడం, సరైన శిక్షణ ఇప్పించకపోవడంవంటి అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిద్దామని మంత్రి కే తారక రామారావు ఇచ్చిన పిలుపుతో నెల రోజులుగా చేనేత వస్ర్తాల కొనుగోళ్లు, అమ్మకాల్లో ఊహించని విధంగా వచ్చిన మార్పు చేనేత రంగానికి కొత్త ఊపిరి పోసిందనడంలో సందేహం లేదు. చేనేత రంగంపై సమగ్ర విధానం ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తినెలకొంది. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జెల్లా మార్కండేయ నేతృత్వంలో హ్యాండ్లూం ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ యర్రమాద వెంకన్ననేత, నేషనల్ హ్యాండ్లూం బోర్డు మెంబర్ తడ్క యాదగిరి, మాస్టర్ వీవర్ గజం అంజయ్య తదితరులు ఓ నివేదికను సిద్ధం చేశారు.

15 రోజులుగా ఓ బృందం పలుమార్లు సమావేశమై చేనేత అభివృద్ధి నమూనా పత్రాన్ని సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి సమర్పించనున్నట్లు మార్కండేయ చెప్పారు. కేసీఆర్ నిర్ణయంతో వేల కుటుంబాల్లో ఆశలు నిండాయని చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్కా దేవదాసు కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూపిస్తున్న చొరవతో తమకు ధీమా వచ్చిందని వరంగల్ దయానంద్ నవార్ ఛత్రాంగి సహకార సంఘం అధ్యక్షుడు వీ దయానంద్ అన్నారు.

సమగ్ర విధానంలో కార్మికులు కోరుకునేవి ఇవీ..

పోచంపల్లి, గద్వాల, వరంగల్, సిద్దిపేట.. తదితర వస్త్ర ఉత్పత్తి కేంద్రాలతోపాటు సహకార, సహకారేతర రంగాల్లో ని కార్మికులకు మేలు చేయాలి. నైపుణ్యం ఆధారంగా ఉత్పత్తి కోసం ప్రొక్యూర్‌మెంట్ ప్లాన్ ఇవ్వాలి. 25 నుంచి 50 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న మాస్టర్ వీవర్లకు పెట్టుబడి, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ కార్పెట్లు, సహజ రంగులతో ఆధునిక ఫ్యాషన్ వినియోగదారులను ఆకట్టుకునే వస్ర్తాల ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here