చై సమంత పెళ్లిరాగం

0
16

వెండితెరపై కనిపించిన ప్రతిసారీ మాయ చేసి ప్రేక్షకుల్ని అలరించారు నాగచైతన్య – సమంత. ‘ఏమాయ చేసావె’ అంటూ తొలిసారి కలిసిన ఈ ఇద్దరూ ‘భలే జోడీ..’ అనిపించుకొన్నారు. అందమైన ఆ జోడీ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ మనసులు కలుపుకొని ‘మనం’ అంటూ ఇప్పుడు పెళ్లి పాట ఆలపిస్తున్నారు. అక్కినేనివారి అబ్బాయి నాగచైతన్య… తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసిన అందాల భామ సమంత నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్‌.కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకి చెందిన బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య, సమంత ఒకరికొకరు ఉంగరాలు తొడిగారు. సమంతకి ఉంగరం తొడిగాక నాగచైతన్య ఆమెని మురిపెంగా ముద్దాడారు. పెళ్లి కళతో సిగ్గులొలికింది సమంత. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకొని, త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న అఖిల్‌ అక్కినేని- శ్రియ భూపాల్‌ జోడీ ఈ వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగచైతన్య, సమంత నిశ్చితార్థ వేడుక కోసం చేసిన అలంకరణ ‘ఏమాయ చేసావె’ చిత్రంలోని పతాక సన్నివేశాల్ని, వారిద్దరూ ఆ చిత్రంలోని కార్తీక్‌, జెస్సీ పాత్రల్ని గుర్తుకు తెప్పించడం విశేషం. చైతూ, సమంతల పెళ్లి త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోతోంది.

LEAVE A REPLY