చెరుకు ధర పెంపు

0
7

చెరుకు రైతులకు శుభవార్త. క్వింటాలు చెరుకు కనీస మద్దతు ధరను కేంద్రం రూ.20 పెంచింది. దీంతో ప్రస్తుతం క్వింటాలుకు రూ.255 చెల్లిస్తుండగా.. ఇకపై రూ.275 చెల్లించనున్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న చెరుకు కోలుగోలు సీజన్ నుంచి పెంచిన మద్దతు ధర అమలు కానుంది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమయ్యింది. ఇదే రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకావడంతో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైనా క్యాబినెట్ చర్చించింది. పన్నెండు ఏండ్ల లోపు గల మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు నేరం రుజువైన వ్యక్తికి మరణశిక్ష విధించడానికి ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీస్(సవరణ) బిల్లు-2018కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 55 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న మహిళా ఖైదీలు, 60 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న పురుష ఖైదీలు తమకు విధించిన జైలు శిక్షలో సగం కాలాన్ని పూర్తి చేసుకుంటే వారిని మానవతా దృక్పథం కింద విడుదల చేయాలని నిర్ణయించింది.

LEAVE A REPLY