గాంధీభవన్‌ను ముట్టడిస్తాం

0
18

ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ బినామీలు వేసిన కేసులు.. పిటిషన్లను వారంలోగా ఉపసంహరించుకోకపోతే భార్యాపిల్లలతో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకచంద్రం హెచ్చరించారు. తెలంగాణలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకుల భరోసా సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉద్యోగుల ఐకాస చైర్మన్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకు కాంగ్రెస్ నేతలే అడ్డం పడుతున్నారని.. కోర్టుకేసులతో అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నట్టే.. కేసులు, పిటిషన్లను తిప్పికొట్టి క్రమబద్ధీకరణను సాధించుకుని తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఒప్పంద ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఆలోచనతోనే కేసీఆర్ సర్కారు కమిటీని నియమించిందని.. కానీ కేసుల కారణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఉద్యమకారులే.. ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నారని.. మన బాధలు తెలిసిన వారే మనకు న్యాయం చేయగలరని చెప్పారు. బ్రహ్మానందరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు.. చంద్రబాబు నుంచి వైఎస్సార్ వరకు నాటి సీఎంలు, పార్టీలన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY