గణ తంత్రం… యువ మంత్రం!

0
199

నిర్దిష్ట కాలావధుల్లో ఎన్నికల తేదీలను ప్రకటించి ఎలక్షన్లు నిర్వహించినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టమైనట్లు కాదు. ఆ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకొనేలా ఓటర్లలో స్ఫూర్తి రగిలించడం ముఖ్యం. ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పార్టీలు, వాటి ఎన్నికల ప్రణాళికలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల నేపథ్యాలు, గుణగణాలు తదితర అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలు సమకూర్చి ఓటర్లలో అవగాహన పెంపొందించాలి. అప్పుడే ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఓటు హక్కు సామాన్యమైనది కాదు. అది పాశుపతాస్త్రం లాంటిది. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే సాధారణ ప్రజానీకమే తమ ఓటుహక్కు వినియోగించుకోవడం ద్వారా దాన్ని గద్దె దింపి, వేరే పార్టీకి పరిపాలన బాధ్యతలు అప్పజెప్పగలరు. దారి తప్పితే దండన తప్పదని తెలుసు కనుకే, ప్రజలకు కావలసిన రీతిలో పరిపాలన అందజేయడానికి పాలకపక్షాలు ప్రయత్నిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమదే. ఒకేఒక్క ఓటు తేడాతో అభ్యర్థుల గెలుపు ఓటముల నిర్ధారణ జరిగే ఎన్నికల వ్యవస్థ మనది. అంతెందుకు, సభలో ఒక్క ఓటు తరుగుపడి ప్రభుత్వమే రాజీనామా సమర్పించాల్సిన పరిస్థితి గతంలో మనదేశంలోనే ఏర్పడింది. ఓటు ధాటి అదీ. ఓటర్ల చురుకైన భాగస్వామ్యమే ప్రజాస్వామ్యయుత ఎన్నికల వ్యవస్థ విజయానికి కీలకమనడంలో సందేహం లేదు.

పవిత్ర కర్తవ్యం
ఓటు వేయాల్సిన అవసరాన్ని ప్రతీ ఒక్క ఓటరుకు తెలియజెప్పి, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల కమిషన్‌ అనేక చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ఒక్కటే తన బాధ్యత అని అది అనుకోవడంలేదు. ఆ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకువెళ్లడంపైనా శ్రద్ధ వహిస్తోంది. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడంతోనే సరిపెట్టకుండా ఓటర్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఎన్నో చర్యలు, కార్యక్రమాలు చేపడుతోంది. ఈసారి ఓటర్ల దినోత్సవ ప్రధానాంశం యువ, భవిష్య ఓటర్లకు సాధికారత! ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ డాక్టర్‌ నసీమ్‌ జైదీ చెప్పినట్లు- ప్రతీ ఒక్క వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న శక్తికి జాతీయ ఓటర్ల దినోత్సవం నిలువుటద్దం పడుతోంది. 2011నాటి జన గణాంకాల ప్రకారం, దేశంలో 20 ఏళ్ల లోపున్నవారి సంఖ్య దాదాపు 41 శాతం. మొత్తం దేశ జనాభాలో సగం 20-59 వయోవర్గంలోనే ఉన్నారు. 60 ఏళ్ల పైబడినవారు తొమ్మిది శాతం. దేశంలో 35 ఏళ్ల లోపున్నవారి సంఖ్య 65 శాతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. యువ జనాభా ఈ స్థాయిలో ఉన్నందువల్లే- దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ విద్యార్థులు, విద్యా-ఉపాధి అవకాశాలు, వృత్తి నిపుణులకు సంబంధించిన సమస్యలకు సమధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఈ దృష్ట్యా యువత రాజకీయాల గురించి తెలుసుకోవడంతోపాటు, ప్రతి ఎన్నికలో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉంది. యువత, తన ఓటు హక్కుద్వారా ఎన్నికలను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. తద్వారా తమ భవితకు మేలుబాట పరచుకోగలుగుతుంది. కొన్ని లక్షలు, కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు కదా, తాను ఒక్కడిని ఓటు వేయనంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవులెమ్మన్న ఉదాసీన భావన యువతలో కొంతవరకు గూడుకట్టుకొని ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క ఓటుకూ విలువ ఉంటుంది. ఈ వాస్తవాన్ని యువత ఇప్పుడు గ్రహిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది యువ ఓటర్లే. దేశంలోని మొత్తం 81 కోట్ల ఓటర్లలో 35 ఏళ్ల లోపున్నవారు సగం వరకు ఉన్నారు. భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్న నరేంద్ర మోదీ హామీని విశ్వసించి వారు చురుగ్గా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకొన్నారు.

ఓటర్లను జాగృత పరచడానికి ఎన్నికల కమిషన్‌ తనవంతుగా పలు చర్యలు చేపట్టింది. అంతర్జాలంలో ఓటరు అవగాహన ఛానల్‌ ప్రారంభించింది. ఓటుహక్కు ఎంతో ముఖ్యమైనదని, ఉత్సాహంతో ముందుకెళ్లి దాన్ని వినియోగించుకోవాలని వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు ఇచ్చిన పిలుపులు, ప్రసంగాల వీడియో క్లిప్పులను ఆ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారు. తద్వారా ఓటర్లలో ప్రేరణ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోలను యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దానివల్ల విస్తృత ప్రజానీకానికి అవి అందుబాటులో ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) పనితీరు, ‘నోటా’ ఉపయోగించుకొనే విధానం వంటి అంశాలను ఓటర్లకు వివరించే వీడియోలనూ ఆ ఛానల్‌లో చూపెడుతున్నారు. ఓటర్లకు కావలసిన సమాచారాన్ని సమకూర్చడంతోపాటు, వారిలో స్ఫూర్తి కలిగించడానికి ఓటరు అవగాహన పర్యవేక్షకులను నియమించాలని ఎన్నికల కమిషన్‌ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. ఉత్సాహంతో ఓటు వేయడానికి ముందుకు వచ్చేలా ఓటర్లలో ప్రేరణ రగిలించడం వారి ప్రధాన బాధ్యత. వారు అన్ని రాష్ట్రాల్లో పర్యటించాలి. ఓటర్లతో మమేకం కావాలి. పోలింగ్‌ తేదీలు, నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఓటర్లకు ఎంతవరకు తెలుసో మదింపు వేయాలి. ఓటర్లుగా నమోదు కావడం, ఈవీఎంల వినియోగం, ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు పొందడం, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయతీగా ఓటు వేయడం, తప్పుదోవ పట్టించే వార్తలు, ప్రకటనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండటం ఎలాగన్న దానిమీద ప్రచారోద్యమాలు చేపట్టి ఓటర్లను వారు చైతన్యవంతులను చేయాల్సి ఉంటుంది. ఓటర్లు భారీయెత్తున పోలింగ్‌ కేంద్రాల ముందు బారులుతీరి, తమ హక్కును సద్వినియోగపరచుకొనేలా చూడటానికే ఈ వ్యవస్థను ఉద్దేశించారు. ఎన్నికల కమిషన్‌ చొరవను అందిపుచ్చుకొని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌, మాస్‌ ఫర్‌ అవేర్‌నెస్‌, ఎలక్షన్‌ వాచ్‌ కమిటీల వంటి స్వచ్ఛంద సంస్థలు ఓటరు చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకొంటున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఛానళ్లలో క్రియాశీలంగా ఉంటున్న వివిధ బృందాలు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఓటు విలువపై ఓటర్లలో అవగాహన కల్పించడానికి, ఒక్కో ఓటు ప్రజాస్వామ్యాన్ని ఎంతగా పటిష్ఠం చేస్తుందో వివరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు ఓట్‌ ఫర్‌ ఇండియా, ఇండియా ఓట్స్‌ వంటి పలు వెబ్‌సైట్లనూ నిర్వహిస్తున్నాయి. పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల పనితీరు ఆధారంగా ఏటా పరిశోధనాత్మక నివేదికలు వెలువరిస్తున్నాయి.

నిరంతర చైతన్యం
మహిళా ఓటర్ల సంఖ్యలో పెరుగుదల ప్రజాస్వామ్య హితైషులకు నిజంగానే సంభ్రమాశ్చర్యాలు కలిగించే స్థాయిలో ఉంది. లోక్‌సభ ఎన్నికల ముచ్చటే చూద్దాం. 1971లో పురుష ఓటర్ల సంఖ్య 60.87 శాతం. 2014 నాటికి అది స్వల్పంగా పెరిగి 67 శాతానికి చేరింది. అదే కాలంలో మహిళా ఓటర్ల సంఖ్య 49.11 శాతం నుంచి ఎకాయెకిన 65.54 శాతానికి ఎగబాకింది. ఎన్నికల కమిషన్‌ గణాంక వివరాలను విశ్లేషించినప్పుడు – దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను దాటిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, అసోం, దిల్లీ, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో మాత్రం మహిళా ఓటర్లకన్నా పురుష ఓటర్లే ఎక్కువ. వీటిలోనూ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ తేడా చాలా ఎక్కువ. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకొంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు తమ విధి విధానాల్లో మార్పుచేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. మహిళలు ఓటుహక్కు వినియోగం విషయంలో తమ కుటుంబంలోని పురుషులనూ ప్రభావితం చేసే అవకాశం ఉందని స్పష్టం కావడంతో, వారిని మెప్పించేదెలాగన్న అంశానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇదొక శుభ పరిణామం!

ఎన్నికల కమిషన్‌ నిరంతర ప్రయత్నాలతోపాటు ఓటర్లు, ముఖ్యంగా యువజనం జాగృతమై వెల్లువెత్తడంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికస్థాయిలో 66.4 శాతం ఓట్లు నమోదయ్యాయి. 1984లో, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓట్లు 64 శాతం. మొన్నటి ఎన్నికల దాకా అదే ఎక్కువ. 2014 ఎన్నికల్లో ఓటర్లు చరిత్రను తిరగరాశారు. 2009 ఎన్నికల్లో పడిన ఓట్లు 58.2 శాతమే. దాంతో పోలిస్తే ఈ విషయంలో దేశం ఎంత ముందుకు వెళ్లిందో అర్థమవుతూనే ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ.3,426 కోట్లు. 2009 ఎన్నికల నాటి రూ.1,483 కోట్ల కన్నా అది 131 శాతం ఎక్కువ. 1952 నాటి మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.10.45 కోట్లు మాత్రమే. ఓటర్లను జాగృతపరచేందుకు క్రమానుగతంగా వివిధ కార్యక్రమాలు చేపట్టినందువల్లే వ్యయం పెరిగిందని వివరించిన ఎన్నికల కమిషన్‌, తన కృషి ఫలితంగా ఓటర్ల నమోదు శాతం పెరిగిందనీ స్పష్టం చేసింది. ఉద్ధృతంగా ఓటర్ల నమోదు ప్రక్రియ, భయ సందేహాలు లేకుండా ఓటుహక్కు వినియోగించుకొనేలా భరోసా కల్పించడం, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఓటర్ల అవగాహన (స్వీప్‌) కమిటీల ఏర్పాటు, ఓటర్లకు సరైన సౌకర్యాల కల్పన వంటి చర్యల వల్ల ఓట్ల శాతం పెరిగిన మాట నిజమే. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ మరింత గట్టిగా కృషి చేసినప్పుడే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పురిపుష్టమై, ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here