ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి

0
13

అమ్మతనాన్ని కీర్తిస్తూ యావత్‌ ప్రపంచం మాతృదినోత్సవం జరుపుకుంటున్న రోజున ఓ నిండు గర్భిణి ఆ కోరిక తీరకుండానే కన్నుమూసింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే గర్భిణి మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని కైకొండాయిగూడేనికి చెందిన ఎన్‌.కీర్తి(23) గర్భిణి. ప్రసవ సమయం మరో నెల ఉండగానే ఆదివారం తెల్లవారుజామున ఆమెకు ఆయాసం వచ్చింది. భర్త సురేష్‌ హుటాహుటిన ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు కీర్తి ఆరోగ్య పరిస్థితి గమనించి ఈసీజీ పరీక్షకు పురమాయించారు. ఈసీజీ తీస్తుండగానే ఆమె నోటి నుంచి నురుగ కారుస్తూ మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఆసుపత్రికి తీసుకొచ్చిన గంట వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. కాగా వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే నిండు గర్భిణి చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.

LEAVE A REPLY