‘క్వీన్‌’ సలహా తీసుకుంటా

0
28

హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ చిత్రం కంగనా రనౌత్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రమే కంగనాను ‘బాలీవుడ్‌ క్వీన్‌’గా పిలిచే స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఆ సినిమాను రీమేక్‌ చేస్తే అందులో నటించే అవకాశాన్ని వదులుకోకూడదని పలువురు దక్షిణాది కథానాయికలు అనుకున్నారు. ఆ అవకాశం మిల్క్‌ బ్యూటీ తమన్నాను వరించింది. నటి రేవతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటించేందుకు మాతృకలో నటించిన కంగనా సలహాలు తీసుకుంటే మంచిదని తమన్నా భావిస్తోందట.
‘‘ఇప్పటివరకు కంగనాని కలవలేదు. ఆమెతో మాట్లాడలేదు. కానీ ‘క్వీన్‌’లో ఆమె నటనకు ఆకర్షితురాలినయ్యా. అందులో కంగనా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. అందుకే ఈ చిత్రానికి సంబంధించి తన అనుభవాలు.. సలహాలను తెలుసుకోవాలని అనుకుంటున్నా. అవి ‘క్వీన్‌’ రీమేక్‌లో నటించేందుకు నాకు ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని చెప్పింది మిల్కీబ్యూటీ.

‘క్వీన్‌’ చిత్రం మాతృకలో ఉన్నట్టుగానే తెరకెక్కిస్తారా? ఏమైనా మార్పులు చేస్తున్నారా? అని అడగ్గా.. ‘‘ఈ సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తీయాలని అనుకోవడం లేదు. దక్షిణాది ప్రేక్షకులకు నచ్చేట్టుగా కొద్దిపాటి మార్పులు చేయబోతున్నాం. రేవతి మేడమ్‌కి నటిగా, దర్శకురాలిగా మంచి అనుభవం ఉంది. కచ్చితంగా ఆమె ఈ సినిమాకి న్యాయం చేస్తుందనే అనుకుంటున్నా’’ అని తెలిపింది తమన్నా..

LEAVE A REPLY