క్యాష్‌లెస్‌ గ్రామానికి 10 లక్షల నజరానా

0
21

నగదు రహిత బదిలీ లావాదేవీలను వంద శాతం అమలుచేసిన తొలి గ్రామానికి రూ.10లక్షలు, రెండో గ్రామానికి రూ.5లక్షల చొప్పున నజరానా అందించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. నగదు రహిత కార్యక్రమానికి పైలెట్‌ ప్రాజెక్టు కోసం ఎంపికైన సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు అవగాహన సదస్సులలో మంత్రి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు చిల్లరకు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వందకు వంద శాతం నగదు రహిత లావాదేవీలను కొనసాగించి దేశంలోనే నగదు రహిత నియోజకవర్గంగా సిద్దిపేటకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రతి కార్యక్రమంలోనూ ఈ నియోజకవర్గం ముందంజలో ఉందని, ఇప్పుడు నగదు రహిత లావాదేవీల్లోనూ ముందుండాలని పేర్కొన్నారు. సిద్దిపేటతో మొదలై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతి నిర్మూలన జరుగుతుందని, ధరలు దిగివస్తాయని చెప్పారు. ఇప్పటికే మహిళా సంఘాలు, రేషన్‌ డీలర్లు, వ్యాపారులు, గ్యాస్‌ ఏజన్సీల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, కిరాణ వర్తకులు, అధికారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతాతోపాటు రూపే డెబిట్‌ కార్డు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజులలో నియోజకవర్గంలోని దుకాణాలకుు 6వేల స్వైపింగ్‌ మిషన్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హరీశ్‌ వివరించారు.

LEAVE A REPLY