క్యాష్‌‘లాస్‌’..

0
10
జిల్లాలో దాదాపు 250 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. రమారమి రోజుకు మూడు లక్షల లీటర్ల పెట్రోల్‌, ఐదు లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతాయి. ఇంత మొత్తంలో వ్యాపారం జరిగే బంకుల్లో క్యాష్‌లెస్‌ లావాదేవీలు నిర్వహిస్తే 11 శాతం సర్వీస్‌ చార్జి పడుతుంది. నగరానికి చెందిన శ్రీనివాస్‌ కార్డు ద్వారా క్యాస్‌లెస్‌ లావాదేవీలో రూ.100 పెట్రోల్‌ కొట్టిస్తే బ్యాంకు ఖాతాలో రూ. 111 డెబిట్‌ అయ్యాయి. అదేంటి అని బంకులో ప్రశ్నిస్తే మాకు తెలియదు మాకు రూ.100 వస్తాయి. బ్యాంకు వారిని అడగండి అన్నారు. బ్యాంకులో సంప్రదిస్తే సర్వీస్‌ చార్జీ కింద 11 శాతం అంటే అదనంగా రూ. 11 కట్‌ అయ్యాయని తెలిపారు. దీంతో ఆయన నగదు రహిత లావాదేవీలకు దూరం జరిగాడు. సినిమా టికెట్లు బుక్‌ చేసినా సర్వీస్‌ చార్జీ కింద 15 శాతం కట్‌ అవుతుంది. ఇటీవల రమేష్‌ రూ. 100 విలువ చేసే మూడు టిక్కెట్లు బుక్‌ చేస్తే రూ.345 బ్యాంకు ఖాతాలో నుంచి కట్‌ అయింది. ఇలా ప్రతి చోటా క్యాష్‌లెస్‌ లావాదేవీలు నిర్వహిస్తే 11 నుంచి 15 శాతం కట్‌ అవుతుంది.

ఇతర వ్యాపారాల్లో 2 శాతం నుంచి..
ఇతర వ్యాపార సంస్థల వద్ద కార్డులు స్వైప్‌ చేస్తే రెండు నుంచి నాలుగు శాతం సర్వీస్‌ చార్జి రూపంలో కట్‌ అవుతోంది. బ్రాడీపేటలోని ఓ వస్త్ర దుకాణంలో రమేష్‌ దుస్తులు కొనుగోలు చేస్తాడు. గతంలో షాపు యజమాని బిల్లు మొత్తంలో పది శాతం లోపు డిస్కౌంట్‌ ఇచ్చాడు. సంక్రాంతికి దుస్తులు కొన్న సమయంలో కార్డు ద్వారా చెల్లింపు అనగానే సదరు యజమాని సర్‌ డిస్కౌంట్‌ ఇవ్వను అన్నాడు. అదేంటి అంటే నగదు ఇస్తేనే డిస్కౌంట్‌ లేదంటే లేదన్నాడు. ఎందుకు అని అడిగితే తమకూ సర్వీస్‌ చార్జి పడుతుందని అందుకే డిస్కౌంట్‌ ఇవ్వలేనని తెగేసి చెప్పాడు. దీంతో రమేష్‌ రూ.3 వేలు కార్డు ద్వారానే చెల్లింపులు జరిపాడు. తీరా బ్యాంకు నుంచి రూ. 3,300 కట్‌ అయింది. ఇక్కడ సర్వీస్‌ ఛార్జి రూ. 300 నష్టపోతే డిస్కౌంట్‌ రూపంలో మరో రూ.300 వెరసి రూ.600 నష్టపోయాడు. ఇలా ఎవరికి వారు నగదు రహిత లావాదేవీల్లో నష్టపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఎవరికి వారు జేబులో కార్డు పెట్టుకుంటున్నారు కానీ ఎక్కడా స్వైప్‌ చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై సర్వీస్‌ చార్జి లేకుండా చూడటంతోపాటు ఐదు శాతం రాయితీ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY