కోటీ ఆరు లక్షల చీరెలు పంపిణీకి సర్కార్ నిర్ణయం

0
10

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరెల పంపిణీ సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటిరోజు ప్రశాంతంగా కొనసాగిన కార్యక్రమంలో పది వేల కేంద్రాల్లో 25 లక్షల చీరెలను మహిళలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సారెను తీసుకోవడానికి ఉదయం నుంచే మహిళలు పెద్దఎత్తున పంపిణీ కేంద్రాలకు తరలివచ్చి, బారులు తీరారు. తమ వద్దనున్న అధారాలను చూపించి చీరెలు అందుకున్నారు. సంతోషంతో ఇంటికి తిరిగి పయనమయ్యారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చీరెలను అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పంపిణీచేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ముస్తాబాద్‌లో ఎల్లవ్వ అనే మహిళకు కేటీఆర్ చీరెను అందించినప్పుడు ఆమె సంతోషం వెలిబుచ్చుతూ.. ఈ చీరెను పుట్టింటి నుంచి వచ్చిన కానుకగా భావిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తరఫున ఉచితంగా చీరెలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here