కోటిన్నరపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

0
29

సంవత్సరానికి రూ.కోటిన్నర వరకు టర్నోవర్ ఉన్న డీలర్లు, వ్యాపారసంస్థల నుంచి జీఎస్టీ వసూలుచేసే అధికారం రాష్ర్టాలకే ఉండాలని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు కుండబద్దలు కొట్టారు. జీఎస్టీపై రాజకీయంగా పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో ఆదివారం అన్ని రాష్ర్టాల ఆర్థికమంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అయినప్పటికీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నోట్లరద్దు ఫలితంగా రాష్ట్రఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ.. ఉద్యోగుల వేతనాలకు ఎటువంటి ఢోకా లేదని ఆయన స్పష్టంచేశారు.

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:జీఎస్టీకి సంబంధించి కేంద్రానికి, రాష్ర్టాలకు నడుమ కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడలేదు. సంవత్సరానికి రూ.కోటిన్నర వరకూ టర్నోవర్ ఉన్న డీలర్లు, వ్యాపారసంస్థల నుంచి జీఎస్టీ పన్నును వసూలు చేసే అధికారం రాష్ర్టాలకే ఉండాలని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు కుండబద్దలు కొట్టారు. రూ.కోటిన్నరకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థల నుంచి పన్ను వసూలు అధికారం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సంయుక్తంగా ఉండాలని ప్రతిపాదించారు. కానీ కేంద్రం మాత్రం అన్ని సంస్థలూ తన నియంత్రణలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నది. గతంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడితే… రాజకీయంగా పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో ఆదివారం అన్ని రాష్ర్టాల ఆర్థికమంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అయినప్పటికీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అధికారులు సోమవారం మరోమారు దీనిపై చర్చించాలని, ఈ నెల 25వ తేదీన జరిగే జీఎస్టీ మండలి సమావేశానికి అవసరమైన కసరత్తును అధికారులు పూర్తి చేయాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు. సమావేశం అనంతరం తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న సంస్థల్లో సుమారు 75 శాతం రాష్ర్టాల పరిధిలోనే ఉన్నాయి. వ్యాట్, సేల్స్‌టాక్స్, కమర్షియల్ టాక్స్ మొదలైనవాటిని రాష్ర్టాలే వసూలు చేస్తూ ఉన్నాయి. మిగిలిన సెంట్రల్ ఎక్సైజ్, సీఎస్టీ తదితర పన్నుల్ని మాత్రం కేంద్రం వసూలు చేస్తున్నది. ఇలాంటివి కేవలం 25 శాతం మాత్రమే ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది కాబట్టి రాష్ర్టాలన్నీ ఏకాభిప్రాయంతో రెండు ప్రతిపాదనలను అరుణ్‌జైట్లీ ముందు ఉంచాయి. కానీ కేంద్రానికి అది అంగీకారం కాలేదు. ఈ రెండు ప్రతిపాదనల్లో మొదటిది… ఏడాదికి రూ.కోటిన్నర వరకు టర్నోవర్ ఉన్న సంస్థలు, డీలర్లను రాష్ర్టాల నియంత్రణకే వదిలేయాలి. రెండవది… పన్ను పరిధిలోకి వస్తున్న సంస్థల్లో 75 శాతం సంస్థలను రాష్ర్టాలకు వదిలేసి మిగిలిన 25 శాతం సంస్థలను కేంద్రం-రాష్ర్టాలు ఉమ్మడిగా నియంత్రించాలి. ఈ రెండింటికీ కేంద్రం అంగీకరించలేదు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీకి సంబంధించిన సమాచారాన్ని కూడా రాష్ర్టాలకు అందజేయాలని కోరాం. దీనిపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో… అధికారుల స్థాయిలో మరోమారు చర్చలు జరపాలని, అనంతరం ఈ నెల 25న పూర్తిస్థాయి జీఎస్టీ మండలి సమావేశంలో కోటిన్నర టర్నోవర్‌పై ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి సమావేశం వచ్చింది. ఈ నెల 24, 25వ తేదీల్లో రెండురోజుల పాటు జీఎస్టీ మండలి సమావేశం జరుపాలని తొలుత అనుకున్నా, పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఒక్కరోజుకే కుదించటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here