కొలంబియాలో కూలిన విమానం, బ్రెజిల్ దేశవాళీ ఫుట్‌బాల్ క్రీడాకారులు సహా 76మంది మృతి

0
32

బ్రెజిల్ దేశీవాళీ ఫుట్‌బాల్ క్రీడాకారులతో ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ఒకటి కొలంబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో 76 మంది ప్రయాణికులు చనిపోగా.. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. బ్రెజిల్‌లోని సావో పౌలో నుంచి ఫస్ట్ డివిజన్ ఫుట్‌బాల్ క్రీడాకారులు సహా 72మంది ప్రయాణికులు, తొమ్మిదిమంది విమాన సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం బొలీవియాలోని సాంటా క్రూజ్ మీదుగా మెడిలిన్‌కు బయ ల్దేరింది. సోమవారం రాత్రి 10గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30గంటలకు) మెడిలిన్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండగానే విమానంలో విద్యుత్ సంబంధిత సమస్యలు వచ్చాయి.

11వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మెడిలిన్ నగర శివారులోని పర్వతప్రాంతంలో పెద్ద శబ్దంతో విమానం నేలకూలింది. ఈ ఘటలో 76మంది చనిపోయారు. పర్వతప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సహాయసిబ్బంది అక్కడికి చేరుకోవడానికి గంటన్నరకుపైగా పట్టిందని.. పైగా భారీగా వర్షం కురుస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర విఘాతం కలిగిందని మెడిలిన్ పోలీస్ కమాండర్ జోస్ గెరారోడ అకెవెడో తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్రీడాకారులు సహా మరో ముగ్గురు ప్రయాణికులను దవాఖానకు తరలించామని, వారిలో ఒకరు మృతిచెందినట్లు చెప్పారు. విమానంలోనున్న 81మందిలో 76మంది మృత్యువాత పడినట్లు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడినవారిలో ఫుట్‌బాల్ క్రీడాకారులు డిఫెండర్ అలన్ రశ్చెల్, గోల్‌కీపర్ మార్కోస్ డానిలో పాడిల్లా, జాక్సన్ ఫాల్‌మన్, ఓ పాత్రికేయుడు, విమాన సహాయకుడు ఉన్నారని కొలంబియా ఏవియేషన్ అథారిటీ చీఫ్ అల్ఫ్రెడో బొకానెగ్రా మీడియాకు చెప్పారు. ప్రమాదం అనంతరం సహాయచర్యల నిమిత్తం ఓ హెలికాప్టర్‌ను పర్వత ప్రాంతాలకు పంపాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు భావించినా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ చర్యలను నిలిపివేశారు. కాగా, క్రీడాకారులు పాల్గొనాల్సిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (కోపా సూడమెరికానా) ఫైనల్ పొటీలను నిర్వాహకులు రద్దు చేశారు. బుధవారం బ్రెజిల్ దేశవాళీ క్లబ్ అయిన చాపెకోయెన్స్‌కు కొలంబియాకు చెందిన అట్లెటికో నేసియోనాల్‌కు మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉన్నది. ప్రమాదం నేపథ్యంలో పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here