కొత్త పాలకుల పేర్లను సూచించండి!

0
25

బీసీసీఐ, జస్టిస్ లోధా కమిటీ కేసులో కొత్త మలుపు. క్రికెట్ బోర్డు కార్యకలపాలను పర్యవేక్షించేందుకు వీలుగా తాత్కాలిక కమిటీ కోసం సమర్థులైన పాలకుల పేర్లను సూచించాలని సుప్రీంకోర్టు.. మంగళవారం బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇందులో ఎవరూ 70 ఏండ్లకు పైబడి ఉండరాదని కచ్చితమైన నిబంధనను విధించింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. బీసీసీఐ చీఫ్ కోసం అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణ్యం, అనిల్ దివాన్ సీల్డ్ కవర్‌లో అందజేసిన 20 మందితో కూడిన జాబితాను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడి ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇందులో చాలా మంది 70 ఏండ్లు పైబడి ఉన్నారని, తాజాగా కొత్త పేర్లను సూచించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు బీసీసీఐ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే ఫిబ్రవరి 2న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రస్తుతం బీసీసీఐ ఆఫీస్ బేరర్లలోని ముగ్గురి పేర్లను శుక్రవారంలోగా సీల్డ్ కవర్‌లో అందజేయాలని సూచిస్తూ ఈనెల 30కి కేసును వాయిదా వేసింది. కొత్త పాలకుల పేర్లను సూచించేందుకు కేంద్రం, బీసీసీఐకి అనుమతి జారీ చేస్తున్నాం. అయితే గతేడాది జూలై 16, ఆ తర్వాతి తీర్పులకు లోబడి ఈ పేర్లు ఉండాలి. కమిటీలో ఎంతమంది ఉండాలనేది మేం నిర్ణయిస్తాం. అమికస్ క్యూరీ, బీసీసీఐ, కేంద్రం ఇచ్చే పేర్లను పరిగణనలోకి తీసుకొని దీనిపై తుది నిర్ణయానికొస్తాం అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here