కొత్త తరహా చిత్రాలు చేసే ధైర్యాన్నిచ్చింది!

0
27

రెగ్యులర్‌గా కమర్షియల్ చిత్రాలు చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం వున్నా సంకల్ప్ చెప్పిన కథని నమ్మి రిస్క్ చేయడానికి సిద్ధపడిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను. ఘాజీ అనూహ్య విజయాన్ని సాధించి ఇలాంటి మరిన్ని కొత్త తరహా చిత్రాలు చేసే ధైర్యాన్నిచ్చింది అన్నారు రానా. ఆయన నటించిన తాజా చిత్రం ఘాజీ. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్‌లో థాంక్స్‌మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ దర్శకుడు సంకల్ప్ తను ఏదైతే నమ్మాడో దాన్ని తెరకెక్కించడానికి సిద్ధపడి సబ్‌మెరైన్ సెట్‌ని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజు అతని సంకల్పం నెరవేరింది. మంచి నటులతో పనిచేస్తే వారి నుంచి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం వుంటుందంటారు. నాకు ఈ చిత్రంలో అలాంటి మంచి నటులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ప్రతి ఒక్కరు పాత్రల్లో లీనమై తమ సినిమాగా భావించి చేయడం వల్లే ఇది సాధ్యమైంది. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి మది అందించిన ఛాయాగ్రహణం ప్రధాన భూమికను పోషించింది అన్నారు.

అతుల్ కులకర్ణి మాట్లాడుతూ నిర్మించడానికి ఎవరూ సాహసించని సినిమా ఇది. అలాంటి కథని నమ్మి నిర్మాతలు ముందుకు రావడం ఆనందంగా వుంది. ఈ చిత్ర విజయం మరిన్ని మంచి చిత్రాలకు ఊతమిచ్చింది. ఇలాంటి చిత్రంలో నేనూ ఓ భాగమైనందుకు గర్వంగా వుంది అన్నారు. కె.కె.మీనన్ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల నా కెరీర్‌లో నేను నటించిన అత్యుత్తమ చిత్రమిది. భారతీయ సినీ చరిత్రలోనే అండర్ వాటర్‌లో నిర్మించిన తొలి చిత్రంలో నేను నటించినందుకు గర్వంగా వుంది అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సంకల్ప్, పీవీపీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here