కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్!

0
21

ఇతర పార్టీల నాయకులు ఇచ్చే డబ్బు తీసుకోండి. ఓటు మాత్రం ఆప్‌కే వేయండి అంటూ గోవాలో జరిగిన ఎన్నికల సభలో పిలుపునిచ్చిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలపై ఈనెల 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నివేదిక ఇవ్వాలని గోవా ఎన్నికల సంఘం అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది లంచాలను ప్రోత్సహిస్తున్నట్టు అవుతుందని ఈసీ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, గోవాలో ఆప్ ప్రచారకర్తగా జనం మధ్య హుందాగా మెలగాలని సూచించింది. డబ్బు తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలతో ఓటర్లను తప్పుదోవ పట్టించినట్టు అవుతుందని, పార్టీల నుంచి లంచాలు తీసుకోవాలని ప్రోత్సహించడం ఓ ప్రజాప్రతినిధిగా సరైన చర్య కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ప్రజాప్రతినిధుల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. గతంలోనూ కేజ్రీవాల్ డబ్బులు తీసుకోవాలని ప్రచారం చేయడం వివాదాస్పమైంది. దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేసింది. అప్పట్లో దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here