కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి

0
21

అనతికాలంలోనే అద్భుత విజయాలను అందుకుంటున్న భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధు మరో ఘనతను సాధించింది. ఇప్పటికే ఒలింపిక్ పతకాన్ని ముద్దాడిన ఈ తెలుగమ్మాయి, ఇక తన చిరకాల స్వప్నమైన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకునేందుకు అత్యంత చేరువైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు మహిళల సింగిల్స్‌లో ఏకంగా మూడుస్థానాలు మెరుగుపరచుకొని రెండోర్యాంక్‌కు చేరుకుంది. సింధు కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ర్యాంకు. గతవారం ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్‌ను చిత్తుచేసి విజేతగా నిలువడంతో సింధు ర్యాంకు చాలా మెరుగైంది. ఇండియా ఓపెన్ టైటిల్‌తో ఏకంగా 9,200 పాయింట్లు దక్కించుకున్న సింధు.. ఇప్పుడు ఓవరాల్‌గా 75,759 ర్యాంకింగ్ పాయింట్లతో ప్రపంచ 2వ ర్యాంకులో నిలిచింది. 87,911 పాయింట్లతో చైనీస్ తైపీ షట్లర్ తాయ్ జూ యింగ్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నది.

స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ (75,664 పాయింట్లు) 3వ ర్యాంకులో ఉండగా.. జపాన్ అమ్మాయి అకానె యమగుచి (74,349), దక్షిణ కొరియా షట్లర్ సంగ్ జీ హ్యూన్ (73,446) వరుసగా 4, 5వ ర్యాంకులతో టాప్‌ఫైవ్‌లో ఉన్నారు. మరో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (64,279) ఓ స్థానం కోల్పోయి 9వ ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ తర్వాత టాప్-5 ర్యాంక్‌లో చోటు దక్కించుకున్న భారత మహిళా షట్లర్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన 21ఏండ్ల సింధు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళుతున్నది. రియో విశ్వక్రీడల తర్వాతే చైనా ఓపెన్‌తో కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు.. గతవారం ఇండియా ఓపెన్‌తో రెండో సూపర్‌సిరీస్ టైటిల్ సాధించింది. సింధు జోరు చూస్తుంటే సైనా తరహాలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించడం మరెంతో దూరం లేదనుకోవచ్చు. అంతకుముందు సైనా కెరీర్‌లో తొలిసారిగా 2015లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here