కెప్టెన్‌ అమెరికా.. మేడిన్‌ హైదరాబాద్‌

0
13

ఇంజినీరింగ్, ఐటీ, మెడిసిన్‌… ఒక్కటేమిటి, ప్రతీ రంగంలో అమెరికాలో భారతీయులు, అందులో హైదరాబాదీలు తమ ముద్ర ప్రదర్శించడం కొత్త కాదు. యూఎస్‌కు వెళ్లి తమ అపార ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు క్రికెట్‌లో కూడా అలాంటి ఘనతను ఒక  హైదరాబాదీ సాధించాడు. నగరానికి చెందిన ఇబ్రహీం ఖలీల్‌ అమెరికా జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా  అవకాశం దక్కించుకున్నాడు. అంతే కాదు… నాయకుడిగా తన తొలి సిరీస్‌లోనే టీమ్‌ను విజయ పథంలో నడిపించి సత్తా చాటాడు. హైదరాబాద్‌ తరఫున దాదాపు 12 ఏళ్ల పాటు రంజీ ట్రోఫీ ఆడిన ఖలీల్‌… ఇప్పుడు యూఎస్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుగుతున్న సమయంలో మరో కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం.  

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు వికెట్‌ కీపర్‌గా ఇబ్రహీం ఖలీల్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీల్లో కూడా బరిలోకి దిగిన ఖలీల్‌ మొత్తం 57 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సహా 2,158 పరుగులు చేసిన అతను… 186 క్యాచ్‌లు పట్టాడు. 2011లో గువాహటిలో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతను 14 మందిని (11 క్యాచ్‌లు, 3 స్టంపింగ్‌లు) అవుట్‌ చేయడంలో భాగమై ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. అప్పట్లో సంచలనంలా వచ్చి, తర్వాత రద్దయిన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌) ఆడిన వారిలో అతను కూడా ఒకడు. ఇప్పుడు ఖలీల్‌ అమెరికా తరఫున ఆడటమే కాకుండా, తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అనుభవంతో జట్టు కెప్టెన్‌గా కూడా ప్రత్యేకత ప్రదర్శించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here