కులవృత్తులకు ఊతం..

0
21

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యంగా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. కులవృత్తులకు ఊతమిచ్చేందుకు, బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలలో ప్రతి కుటుంబ జీవన స్థితిగతులను అధ్యయనం చేసి పేదరికంలో ఉన్నవారి జీవితాలలో కొత్త వెలుగుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని అన్నా రు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడానికి మళ్లీ మన ఊరు-మన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. రానున్న పదేండ్ల అభివృద్ధికి సంబంధించి జిల్లాల వారీగా మ్యాప్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటైన కొత్త జిల్లాలలో ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలుకావాలని అన్నారు.

జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలవారు కులవృత్తులకు ఆదరణ కరువై దీనస్థితిలో ఉన్నారని, ఆ వృత్తులకు పునరుజ్జీవం కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా దాదాపు 25 లక్షల జనాభా ఉన్న యాదవుల అభ్యున్నతికోసం గొర్రెల పెంపకంపై ప్రభుత్వం భారీ కార్యక్రమం తీసుకుంటున్నదని, ఈ మేరకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో చేపలు పెంచటం ద్వారా వాటి ని సమర్థంగా వాడుకోవాలన్నారు. సమాజం నుంచి దూరంగా ఉంచిన ఎస్సీలు, ఎస్టీలు, మహిళల వంటి మానవ వనరులను వినియోగించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి జిల్లాల వారీగా సబ్‌ప్లాన్‌కు రూపకల్పన చేసి ప్రభుత్వానికి పంపించాలని నిర్దేశించారు. కారుణ్య నియామకాలను పదిరోజుల్లో చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సుమారు 8గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన సీఎం కేసీఆర్ ప్రొవైడింగ్ లీడర్‌షిప్, పీపుల్ కౌన్సెలింగ్, మ్యాప్ ది లోకల్ రిసోర్స్, ట్యాప్ ది వెల్త్ లక్ష్యాలుగా తీసుకొని పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here