కారులోనే రూ.24 కోట్లు!

0
22

ప్రముఖ గుత్తేదారు శేఖర్‌రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లల్లో రూ.కోట్లల్లో నగదు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతూనే ఉంది. తితిదే పాలక మండలి సభ్యుడిగా వ్యవహరించిన శేఖర్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి శుక్రవారం వరకు రూ.107 కోట్ల నగదు, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కూడా శేఖర్‌రెడ్డి స్వగ్రామమైన కాట్పాడి సమీపంలోని తొండాన్‌తులసిలో ఆయనకు చెందిన ఇల్లు, బంధువుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటివద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారులో రూ.24 కోట్ల నగదు లభ్యమైంది. ఇవన్నీ కొత్త రూ.2 వేల నోట్లు కావడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాటిని చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరోవైపు శేఖర్‌రెడ్డికి ఇతర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో కూడా అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. కాట్పాడి పరిధి గాంధీనగర్‌లోని ఈస్ట్‌క్రాస్‌రోడ్‌లో ఉన్న ఆయన భవనానికి గత గురువారం అధికారులు సీల్‌ వేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు నిర్వహించాలని భావించడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్‌రెడ్డి భార్య జయశ్రీని శనివారం సాయంత్రం 6.20 గంటలకు అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. ఇంటి సీల్‌ను తొలగించి తనిఖీలు ఆరంభించారు. ఆదాయపు పన్నుశాఖ అదనపు కమిషనర్‌ మురుగ భూపతి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ సోదాలు చేపట్టింది. ఈ ఇంట్లో కూడా రూ.కోట్లల్లో నగదు ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోదాలు ఆదివారం ఉదయం వరకు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం

LEAVE A REPLY