కాంగ్రెస్ కథ ముగిసింది

0
14

కాంగ్రెస్ కథ ముగిసిందని, గతచరిత్ర అయిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాగ్రెస్‌లో శక్తి ఆరిపోయిందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీ మునిగిపోతున్నదని చెప్పారు. అసలు ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అంతుచిక్కడం లేదని పేర్కొన్నారు. పంజాబ్‌లోని జలంధర్, లూధియానాల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలలో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో బాదల్ కుటుంబాన్నే మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అడుగంటిపోతున్న కాంగ్రెస్ అధికారం కోసం వెంపర్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. మునిగిపోతున్న పడవలో పంజాబ్ ప్రజలు కాలుపెడతారా? అని ప్రశ్నించారు. ఒడ్డున పడ్డ చేపలా అధికారం కోసం కాంగ్రెస్ గిలగిలలాడుతున్నది అని దుయ్యబట్టారు. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన అకాలీనేత ప్రకాశ్‌సింగ్ బాదల్‌ను ఎన్నుకోవడమే పంజాబ్ ప్రజలకు శ్రేయస్కరమని సూచించారు. ధీరులను కన్న గడ్డను మరోసారి శక్తిమంతం చేయడమే ఈ ఎన్నికల్లో ప్రధానాంశమని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. అధికారం కోసం ఎంతవరకైనా పోతున్నది అని పరోక్షంగా ఆ పార్టీ పెట్టుకుంటున్న పొత్తులను ఎత్తిచూపారు. ముఖ్యమంత్రి బాదల్ హిందువులు, సిక్కుల మధ్య మైత్రికి అహోరాత్రాలు కృషి చేశారని ప్రధాని ప్రశంసించారు. తనను ఎప్పుడు కలుసుకున్నా ఆయన పంజాబ్ అభివృద్ధి గురించే మాట్లాడుతారని చెప్పారు.

LEAVE A REPLY