‘కస్తూరి’ ద్వైమాస విద్యాపత్రికకు శ్రీకారం

0
30

సర్వశిక్షా అభియాన్‌ ‘కస్తూరి’ పేరుతో బాలికల ద్వైమాస విద్యా పత్రికకు శ్రీకారం చుట్టింది. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో చదివే బాలికలకు ఈ సంచికను ఇవ్వనున్నారు. ఈ సంచికలో కౌమరదశలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలు, తొలి ఆధునిక భారత మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలు, మలాల రాసిన పుస్తక పరిచయం వంటి అంశాలను అందులో పొందుపరిచారు. టెక్నాలజీ, కెరియర్‌ గైడెన్స్‌ వంటి అంశాలను కూడా వచ్చే సంచిక నుంచి ఇవ్వబోతున్నట్లు సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ చెప్పారు. ‘కస్తూరి’ ప్రారంభ సంచికతోపాటు పరిశుభ్రతపై రూపొందించిన ‘మల్లిగాడి మరుగుదొడ్డి’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. ‘స్వచ్ఛ భారత్‌’ మిషన్‌లో భాగంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’ అనే పుస్తకాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సర్వశిక్షా అభియాన్‌ అధికారులు నిర్ణయించారు. ఇందులో స్వచ్ఛత, మరుగుదొడ్ల వాడకం, చేతుల శుభ్రత, చెత్తాచెదారం, మురుగునీటి నిర్వహణ వంటి విషయాలు, ఉపయోగాలు సులభంగా అర్థమయ్యేలా అందమైన కార్టూన్ల ద్వారా వివరించారు. ప్రతి అంశాన్ని పిల్లలకు వినోదంగా, సందేశాత్మకంగానూ ఉండేలా రూపొందించారు. ఈ పుస్తకంలో మల్లిగాడు చెప్పినట్లు సహచర విద్యార్థులు వ్యవహరిస్తే ఏ జబ్బులు దరిచేరవని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here