కల్వకుర్తి పాపం కాంగ్రెస్‌దే

0
15

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ పాపం మూట కట్టుకున్నది. నాడు నిర్లక్ష్యం చేసి.. నేడు మళ్లీ అదే పార్టీ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు దాన్ని ఇతరులపైకి నెట్టుతున్నారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్ మండలం మామిడిమాడ గ్రామంలో నేరడి చెరువును రిజర్వాయర్‌గా మార్చే పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.105 కోట్లతో చేపట్టనున్న కెనాల్ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు.

కేఎల్‌ఐ ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరందించే బ్రాంచ్ కెనాల్‌లో అంతర్భాగమైన నేరడి చెరువు రిజర్వాయర్ పనులతో మరో ఐదు వేల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగుకానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు డీపీఆర్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి ఏమాత్రం నీటి కేటాయింపులు లేకుండా 2012లో కాం గ్రెస్ హయాంలోనే ఒప్పందాలు జరిగాయన్నారు. ఇప్పుడు మళ్లీ కాల్వను కుదించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 29 ప్యాకేజీలో 160 కిలోమీటర్ల కాల్వతోపాటు 1.8 లక్షల ఎకరాల ఆయకట్టును అప్పట్లోనే కేటాయించారని గుర్తుచేశారు. 82వ డిస్ట్రిబ్యూటరీలో 19 వేల ఎకరాల వరకు కుదించిన ఘనత నాటి ప్రభుత్వానిదేనని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని అడ్డంకులొచ్చినా ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 62 వేల ఎకరాలకు సాగునీరందించి తీరుతామని స్పష్టంచేశారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో చేసిన తప్పులను తాము సవరించుకుం టూ వస్తున్నామన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు తగ్గట్టుగా కాల్వలు, రిజర్వాయర్లు ఏమాత్రం నిర్మాణం చేయలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here