కలెక్టరేట్లకు తుదిరూపు!

0
18

సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం పలు కీలక అంశాలను చర్చించనుంది. ఎస్సీ గురుకుల పాఠశాలల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం, కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు, పరిపాలన భవనాలు,అధికారుల నియామకాలు, సాదాబైనామాల ఉచిత రిజిస్ట్రేషన్లు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. గత దసరానాడు కొత్తగా ఆవిర్భవించిన 21జిల్లాల్లో నిర్మించనున్న సమీకృత భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరుగనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు స్థలాల సేకరణతోపాటు బిల్డింగ్‌ప్లాన్లనూ సమర్పించారు. జిల్లాలవారీగా అందిన ప్రణాళికలను ఉన్నతాధికారులు పరిశీలించారు. సమావేశంలో సమీకృతభవనాల ప్లాన్లకు ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్త జిల్లాలలో పాలన వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయి లో పటిష్ఠంగా అమలు చేసేందుకు అవలంబించాల్సిన విధానాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల జీవితాలలో కొత్త వెలుగును తేవడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలుపరుచాలనే విషయంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశముంది.

LEAVE A REPLY