కమ్ బ్యాక్ కింగ్.!

0
31
పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్ట్‌.. అత్యుత్తమ ఫినిషర్‌.. వరల్డ్‌కప్‌ హీరో.. యువరాజ్‌ సింగ్‌ మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. ఎవరూ ఊహించని రీతిలో వన్డేతోపాటు టీ20 జట్టులోనూ పునరాగమనం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కొత్త సారథి విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఎంపిక చేసిన జట్లలో యువీ చోటు దక్కించుకున్నాడు. 35 ఏళ్ల యువరాజ్‌ ఎంపిక ఆశ్చర్యమే కావొచ్చు.. కానీ అదృష్టమయితే కాదు! రంజీల్లో యువీ సాధించిన ప్రతీ పరుగుకూ దక్కిన ప్రతిఫలమిది. లేకపోతే ఎప్పుడో 2013లో వన్డే మ్యాచ్‌.. తొమ్మిది నెలల క్రితం భారత తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన యువీకి జట్టులో చోటు దక్కడమేమిటి? తన చివరి రెండేళ్ల వన్డే కెరీర్‌లో కనీసం 20 సగటుతోనైనా పరుగులు చేయని యువీకి పిలుపు దక్కడమేమిటి? అదికూడా యువ ఆటగాళ్లు అదరగొడుతున్న సమయంలో.. అనే ప్రశ్నలు తలెత్తవచ్చు.
కానీ.. వాటన్నింటికీ సమాధానమే ఈ రంజీ సీజన్‌లో యువీ ప్రదర్శన. ఈ సీజన్‌లో పంజాబ్‌ తరఫున ఐదు మ్యాచ్‌లాడిన ఈ డాషింగ్‌ లెఫ్టాండర్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 84.00 సగటుతో 672 పరుగులు సాధించాడు. అందులో సూపర్‌ డబుల్‌తో సహా రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలున్నాయి. ఈ ప్రదర్శన ఆధారంగానే సెలెక్టర్లు అతణ్ని టీమిండియాలోకి తీసుకున్నారు. ‘రంజీ సీజన్‌లో యువరాజ్‌ ప్రదర్శనను అభినందించక తప్పదు. చాన్నాళ్లుగా అతను సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడడంలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ.. ఈ రంజీ సీజన్‌లో అతడు డబుల్‌ సెంచరీ సాధించాడు. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై 177 రన్స్‌ చేశాడ’ని యువీ ఎంపికపై సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ఇది చాలు యువరాజ్‌ ప్రతిభ ఆధారంగానే జట్టులోకొచ్చాడని చెప్పడానికి.
 
2011 తర్వాత ఇది ఐదోసారి: ఫామ్‌ కోల్పోవడమో లేక గాయపడడమో.. కారణం ఏదైతేనేం వేటు పడడం.. మళ్లీ సత్తాచాటి రీ ఎంట్రీ ఇవ్వడం యువీ కెరీర్‌లో సర్వసాధారణం. 2011 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత యువీ పునరాగమనాల పరంపర మరింత ఎక్కువైంది. ఈ మెగా టోర్నీ తర్వాత యువరాజ్‌ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఇది ఐదోసారి అంటే ఆశ్చర్యం కలగకమానదు. వరల్డ్‌కప్‌ అనంతరం కేన్సర్‌ బారిన పడిన యువీ లండన్‌లో కీమోథెరపీ చేయించుకొని ప్రాణాంతక వ్యాధిని జయించాడు. అయితే అతని క్రికెట్‌ కెరీర్‌ మాత్రం ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ.. పట్టు వదల్లేదు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించి 2012 సెప్టెంబర్‌లో టీ20 జట్టులోకొచ్చాడు. తర్వాత భారత తరఫున వన్డేలకు ఎంపికైనా స్థానం పదిలం చేసుకోలేకపోయాడు. 2013లో దక్షిణాఫ్రికాతో వన్డేలో యువీ చివరిసారిగా బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఇప్పటి వరకూ 50 ఓవర్ల క్రికెట్‌ ఆడలేదు. 2014 టీ20 వరల్డ్‌క్‌పలోనూ జట్టులోకొచ్చినా తనదైన మార్కు చూపలేకపోయాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ గాయం కారణంగా లీగ్‌ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. మొహాలీ వేదికగా 2016 మార్చి 27న ఆస్ర్టేలియాతో జరిగిన మ్యాచ్‌ అతడు చివరిగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌.
 
కోహ్లీ మద్దతుతోనేనా..: టీమిండియాలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరంటే అది యువీ, కోహ్లీనే! ఈ ఇద్దరూ కలిస్తే డ్రెస్సింగ్‌ రూమ్‌ అయినా.. ప్రాక్టీస్‌ సెషన్‌ అయినా సందడిగా మారాల్సిందే. ఇటీవల జరిగిన యువరాజ్‌ పెళ్లి వేడుకకి కోహ్లీ తన గాళ్‌ఫ్రెండ్‌ అనుష్క శర్మతో సహా హాజరై డాన్స్‌లతో హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో పరిమిత ఓవర్ల పగ్గాలు కోహ్లీ చేతికందాయి. దీంతో సెలెక్షన్‌ కమిటీ సమావేశంలో సెలెక్టర్లు కోహ్లీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.
యువీ పేరు ప్రస్తావనకు వచ్చినపుడు విరాట్‌ తన సంపూర్ణ మద్దతు తెలిపాడు కూడా. దీంతో రెండు జట్లలోనూ యువీ ఎంపిక లాంఛనమైంది. సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా కోహ్లీతో మాట్లాడిన తర్వాతే జట్టు ఎంపిక జరిగిందని చెప్పడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఇదొక్కటే ప్రాతిపదిక కాదు. టీమిండియాను ఎక్కువగా వేధిస్తున్న సమస్య 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌. నాలుగో స్థానంలో రైనా విఫలమవడంతో ధోనీ ఆ స్థానానికి మారాడు. కాబట్టి ఐదు, ఆరు స్థానాల్లో సరైన బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన యువీవైపు మొగ్గు చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here