కంగారూల దొంగాట

0
17

డీఆర్‌ఎస్‌.. అంటే అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి. ఐతే ఆస్ట్రేలియా జట్టు దీని అర్థం మార్చే ప్రయత్నం చేసింది. డీఆర్‌ఎస్‌.. అంటే ‘డ్రెస్సింగ్‌ రూం రెఫరల్‌ సిస్టం’ అనిపించేలా వ్యవహరించింది స్టీవ్‌ స్మిత్‌ సేన. మంగళవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన స్మిత్‌.. సమీక్ష కోరాలా వద్దా అని అయోమయంలో పడ్డ స్థితిలో మైదానంలో ఉన్నవారి కళ్లు గప్పి డ్రెస్సింగ్‌ రూం సాయం కోరడం పెద్ద దుమారమే రేపింది. అంపైర్‌ సమయానికి స్పందించడం.. కోహ్లి కూడా కలగజేసుకోవడంతో స్మిత్‌ అన్నీ కట్టిపెట్టి డ్రెస్సింగ్‌ రూం వైపు నడిచాడు. ఈ పరిణామం ‘డీఆర్‌ఎస్‌’లోని ఒక కొత్త ప్రతికూల కోణాన్ని క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసింది.

అది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌. అప్పటికి ఆ జట్టు స్కోరు 74/3. మ్యాచ్‌ సమతూకంతో ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వూపుమీదున్నాడు. అతను అదే జోరును మరికొన్ని ఓవర్ల పాటు కొనసాగిస్తే మ్యాచ్‌ కంగారూల వైపు మొగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఉమేశ్‌ యాదవ్‌ మెరుపులాంటి ఒక బంతి విసిరాడు. వికెట్లకు అడ్డంగా జరిగి.. లెగ్‌ సైడ్‌ బంతిని పంపడంలో నేర్పరి అయిన స్మిత్‌.. అదే తరహాలో ఆడే ప్రయత్నం చేశాడు. ఐతే మోకాళ్లకు దిగువ ఎత్తులో వచ్చిన ఆ బంతి అతడి బ్యాటుకు దొరకలేదు. స్మిత్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. కానీ తర్వాత ఆఫ్‌ వికెట్‌ వైపు జరిగి అంపైర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఉమేశ్‌, భారత ఫీల్డర్లు అప్పీల్‌ చేయడం ఆలస్యం అంపైర్‌ లాంగ్‌ వేలు పైకెత్తేశాడు. ఇక సమీక్ష కోరాలా వద్దో తేల్చుకునేందుకు అవతలి క్రీజులో ఉన్న హాండ్స్‌కాంబ్‌ వద్దకు వచ్చి కొన్ని సెకన్లు చర్చించిన స్మిత్‌.. అంతలోనే వెనక్కి తిరిగి డ్రెస్సింగ్‌ రూం వైపు చూశాడు. సమీక్ష అడగమంటారా.. వద్దా.. అన్నట్లు తలతో, చేతితో స్పష్టంగా సంజ్ఞలు చేశాడు. ఐతే వెనుకే స్మిత్‌ను గమనిస్తూ ఉన్న లాంగ్‌.. ఇలా చేయడానికి వీల్లేదంటూ పరుగు పరుగున అతడి వైపు వచ్చాడు. ఇంతలో కోహ్లి కూడా స్మిత్‌ కపట బుద్ధిని పసిగట్టి ఆగ్రహంతో పిచ్‌ మధ్యలోకి వచ్చాడు. ఐతే తప్పు బయటపడిపోయేసరికి స్మిత్‌ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పెవిలియన్‌ వైపు కదిలాడు. కోహ్లి అంపైర్లిద్దరితో ఆవేశంగా మాట్లాడాడు. స్మిత్‌కు ఇదేం కొత్త కాదంటూ అతను అంపైర్లకు వివరిస్తున్నట్లు కనిపించింది. ఓవైపు భారత్‌ డీఆర్‌ఎస్‌ను వినియోగించుకోవడంలో తడబడుతోంది. ఐతే ఆసీస్‌ మాత్రం ఈ పద్ధతిలో సానుకూల ఫలితాలు రాబడుతోంది. ఎంత అనుభవమున్నా సరే.. వారి ‘కచ్చితత్వం’ సందేహాలు రేకెత్తిస్తోంది. ఐతే బ్యాట్స్‌మెన్‌కు డీఆర్‌ఎస్‌ విషయంలో సహకరించేందుకు ఆస్ట్రేలియా వ్యూహ బృందం తెరవెనుక ఇలాంటి ప్రణాళికతో ఉందన్న సంగతి ఇప్పుడే వెల్లడైంది. స్మిత్‌ తీరు చూస్తే.. కంగారూలకు ఇది అలవాటైన వ్యవహారం లాగే కనిపిస్తోంది. సమీక్ష కోరేటపుడు ఇలా డ్రెస్సింగ్‌ రూం సాయం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. ‘సమీక్ష’ మ్యాచ్‌ ఫలితాల్నే మార్చేసేంతగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో స్మిత్‌ చేసింది అంత చిన్న తప్పిదం కాదు. అందుకే దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. కంగారూల తెరవెనుక వ్యూహం ఎన్నాళ్ల నుంచి నడుస్తోందో కానీ.. ఇలాంటి వ్యవహారాలపై అంపైర్లు కన్నేసి ఉంచాలని తాజా ఉదంతం హెచ్చరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here