ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలిస్తే ఔటే!

0
16

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలిచ్చే కంపెనీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మరోసారి ప్రవేశపెట్టారు. అధికార రిపబ్లికన్ సభ్యుడు డేవిడ్ మెకిన్లే, ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యుడు జీన్ గ్రీన్ ప్రతిపాదనల ప్రకారం.. అమెరికాకు వెలుపల కాల్‌సెంటర్లను నిర్వహించుకునే కంపెనీలకు గ్రాంట్లు లభించవు. ప్రభుత్వం నుంచి రుణాలు కూడా అందవు. భారత్ వంటి దేశాలకు ఉద్యోగాల బదిలీ కొనసాగకుండా చూడటమే ఈ ద్వైపాక్షిక బిల్లు ముఖ్య ఉద్దేశం.

ఈ బిల్లు ప్రకారం ఉద్యోగాలను తరలించే సంస్థలను బ్యాడ్ యాక్టర్స్ జాబితాలో చేరుస్తారు. విదేశీ కాల్‌సెంటర్లు తాము ఎక్కడినుంచి మాట్లాడుతున్నామో వినియోగదారులకు వెల్లడించాల్సి ఉంటుంది. అమెరికా వినియోగదారులు కోరినప్పుడు వారికి అమెరికాలోనే ఉండే సర్వీస్ ఏజెంట్ నుంచి సేవలను అందించాల్సి ఉంటుంది. 2013లో సైతం ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టారు. ఒక్క గ్రేట్ హూస్టన్ ప్రాంతంలోనే 54వేల కాల్‌సెంటర్ ఉద్యోగాలున్నాయని, దేశవ్యాప్తంగా 25 లక్షలున్నాయని గ్రీన్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కాల్‌సెంటర్ ఉద్యోగాలు ఇక్కడి నుంచి భారత్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు తరలిపోతున్నాయి. ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా అమెరికన్లకు ఉద్యోగ భద్రత ఉండటంతోపాటు ఇక్కడి వినియోగదారులు అనుచితమైన ప్రవర్తన నుంచి ఉపశమనం పొందుతారు అని ఆయన పేర్కొన్నారు. మరో వైపు అమెరికా ఎన్నికల సందర్భంగా రష్యన్లతో నెరిపిన సంబంధాలపై చేపట్టే దర్యాప్తులో తాను జోక్యం చేసుకోనని, ఆ కేసుల నుంచి తాను తప్పుకుంటున్నట్టు అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ షెషన్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here