ఓయూకు పూర్వవైభవం తేవాలి

0
28

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, పూర్వ వైభవం దిశగా నడిపించాలని పలువురు పత్రికా సంపాదకులు కోరారు. శతాబ్ది ఉత్సవాల విజయవంతానికి అన్ని పత్రికల సంపాదకులతో ఓయూ అధికారులు ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ (ఓయూసీఐపీ) సెమినార్ హాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓయూ పేరు ప్రఖ్యాతులు గతంతో పోలిస్తే తగ్గాయని, సిబ్బంది, మౌలిక సదుపాయాల లోటు తీవ్రంగా ఉందని మన తెలంగాణ ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఓయూ అనుబంధ కళాశాలల భాగస్వామ్యంతో ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని, పలు ప్రసంగాలను ఏర్పాటు చేయాలని, వర్సిటీలోని అన్ని విభాగాలలో వందకుపైగా పుస్తకాలు ప్రచురించాలని హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచించారు. ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తే దాని ప్రయోజనం, స్ఫూర్తి ఎక్కువ స్థాయిలో ప్రచారం అయ్యే అవకాశం ఉంటుందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ అన్నారు. ఓయూను ప్రపంచానికి మోడల్‌గా నిలుపాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఓయూ కేంద్రంగా ఉద్యమం నడిచిందని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి గుర్తు చేశారు. ఉత్సవాల సందర్భంగా పలు పుస్తకాలు, సావనీర్‌లు రూపొందించాలని, అవి ముందు తరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఉత్సవాల సందర్భంగా అకడమిక్ ఎక్స్‌లెన్స్, బ్రిలియన్స్‌ను చూపెట్టాలని తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక యాప్, వెబ్‌సైట్ లాంటివి ప్రారంభించి కామన్‌గా కాకుండా ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఉస్మానియాలో సామాజిక అవగాహన ఉన్న అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని, సోషియో పొలిటికల్ డైనమిక్స్‌ను మళ్లీ రివైజ్ చేసుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ అభిప్రాయపడ్డారు. ఓయూలో జర్నలిజం చదివి బయటకు వెళ్లినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రఖ్యాతి చెందారని, పూర్వ విద్యార్థులతో సమన్వయం చేసుకుని వర్సిటీ ప్రతిష్ఠ పెరిగేందుకు చర్చించాలని సాక్షి టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ దేవులపల్లి అమర్ సూచించారు. హిందూ సీనియర్ ఎడిటర్ రవికాంత్‌రెడ్డి, ఈనాడు ప్రతినిధి నరసింహారావు, వార్త పత్రిక ప్రతినిధి కోనేటి రంగయ్య తదితరులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, శతాబ్ది ఉత్సవాల స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు శ్యాంమోహన్, రమేశ్‌రెడ్డి, మనోహర్‌రావు, సీపీఆర్వో డాక్టర్ అనిల్‌కృష్ణ, పీఆర్వో డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here