ఒక యుగానికి కర్త సిరివెన్నెల

0
31

తమ పాట, మాటలతో తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న రచయితలు సిరివెన్నెల, సాయిమాధవ్‌లను కళల కాణాచి తెనాలిలో సత్కరించడం తెలుగు భాషకు పట్టాభిషేకం చేయడమేనని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ల ఆత్మీయ సత్కారం ఆదివారం రాత్రి స్థానిక రామలింగేశ్వర పేటలోని మున్సిపల్‌ ఓపెన్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. అరసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగానికి సిరివెన్నెల కర్తగా నిలిచారన్నారు. పాట ద్వారా తెలుగు భాష మాధుర్యాన్ని చవిచూపించిన మహా రచయితగా సిరివెన్నెలను అభివర్ణించారు. పదునైన సంభాషణలకు చిరునామాగా నిలచిన సాయిమాధవ్‌ సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్యునిగా ఎదగడం తెనాలికి గర్వకారణమన్నారు. హాస్య నటులు బ్రహ్మానందం మాట్లాడుతూ తనను ఎవరూ ఆహ్వానించక పోయినా తెనాలిలో సాహిత్యానికి సన్మానం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుని వచ్చానన్నారు. వెండితెర వెన్నెల సిరివెన్నెలతో కలసి జీవించామని తనవంటి వాళ్లు అనుకుంటే ఆయనను చూశామని నేటి యువత గర్వంగా చెప్పుకుంటుందన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతిలను కాపాడే వ్యక్తుల్లో సీతారామశాస్రి, సాయిమాధవ్‌లు ముందు వరుసలో ఉంటారన్నారు. ఇంట గెలిచి, రచ్చ గెలిచి పుట్టిన గడ్డపై సత్కారం అందుకున్న సాయిమాధవ్‌ను చూసి తెనాలి తల్లి మురిసిపోతుందని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. తెలుగు సినిమా మాదే అని అందరూ చెప్పుకునే స్థాయిలో సాయి మాటలు రాస్తున్నారని అభినందించారు. సాంస్కృతిక రాజదానిగా చెపుతున్న తెనాలిలో సత్కారం పొందడం తన అదృష్టంగా బావిస్తున్నానన్న ఆయన బుద్ధప్రసాద్‌ ఉన్నంత వరకు తెలుగు భాష వెలుగుకు కొదవలేదన్నారు. సాయి మాధవ్‌ మాట్లాడుతూ మళ్లీ జన్మంటూ ఉంటే తెనాలి వాసిగానే పుట్టాలని ఉందన్నారు. తన ప్రతి పురోగతిలోనూ సగభాగం దర్శకుడు క్రిష్‌కు దక్కుతుందని వేదిక ద్వారా తన కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు , కమిషనర్‌ కె.శకుంతల, చైతన్యవేదిక అధ్యక్షులు డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి, డి.ఎస్‌.దీక్షిత్‌, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, జానీభాషా, సత్యనారాయణ శెట్టి, అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. అరసం కార్యదర్శి ఆనంద్‌ పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here