ఏ సినిమా అయినా మొదటగా ప్రేక్షకులకు చేరువయ్యేది టైటిలే

0
32

ఏ సినిమా అయినా మొదటగా ప్రేక్షకులకు చేరువయ్యేది టైటిలే. అందుకోసం రచయితలు, దర్శకులు ఎంతో ఆలోచించి క్రేజీ పేర్లు పెడుతుంటారు. కథానుగుణంగా, హీరోల పాత్రచిత్రణ వంటి పలు అంశాల ఆధారంగా టైటిల్స్‌ పెట్టి ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే కోలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్‌ మొదలైంది. తారల పేర్లనే సినిమా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. తద్వారా కావాల్సినంత క్రేజ్‌ సంపాదిస్తున్నారు. గత దశాబ్ధ కాలంలో చూస్తే… ఇప్పటి వరకు ఎంజీఆర్‌, శివాజీ, రజనీకాంత్, కమల్‌హాసన్ నటించిన విజయవంతమైన చిత్రాల టైటిళ్లతో యువహీరోలు నటిస్తున్న చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అగ్రహీరోల పేర్లనే టైటిల్స్‌‌గా పెట్టే కొత్త ట్రెండ్‌ వచ్చేసింది. పలువురు హీరోలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ‘సూర్య ఎంగిర శరవణన్’ అనే చిత్రంలో తన పేరు వినియోగించేందుకు నటుడు సూర్య అంగీకరించని విషయం తెలిసిందే. ‘త్రిష ఇల్లన నయనతార’, ‘మద గజ రాజా’ (ఎంజీఆర్‌), ‘వీర శివాజీ’… ఇలా చెప్పుకుంటూ పోతే తారల పేర్లతో వచ్చిన సినిమాల జాబితా చాలా పొడుగే ఉంటుంది. అన్నింటినీ మించి త్వరలో తెరపైకి రాబోతున్న ఒక కొత్త చిత్రం టైటిల్‌ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. రీల్‌పై, కొన్ని సందర్భాల్లో రియల్‌గాను ప్రత్యర్థులుగా ప్రచారం జరిగిన ‘ధనుష్‌ – శింబు’ పేర్లతో ఆ సినిమా పేరు పెట్టడమే ఇందుకు కారణం. కొత్త తారలు నటిస్తున్న ఆ చిత్రం టైటిల్‌ ‘కాదలిల్‌ శింబువుమ్‌ ధనుషుమ్‌’. ఆ ఇద్దరు అగ్రహీరోల కెరీర్‌ని పరిశీలిస్తే లవ్‌ ఎఫైర్‌లు ఎక్కువే. ఈ చిత్రం టైటిల్‌లో కూడా వారిద్దరి పేర్లకు లవ్‌ని యాడ్‌ చేయడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు, ధనుష్‌, శింబు నటించిన చిత్రాల్లో పంచ్ డైలాగులను ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు సందర్భానుసారంగా ప్రయోగిస్తారట. ఇంతకీ… ఈ టైటిల్‌కు ఆ ఇద్దరు హీరోలు ఓకే చెప్పారా అనడిగితే… శింబు డబుల్‌ ఓకే అన్నారని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు. ఈ చిత్రంలో అప్పుకుట్టి, గంజాకరుప్పు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here