ఏడు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు

0
38

రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన ముమ్మరంగా సాగుతున్నది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంతో సబ్‌రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో అవినీతిపరులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భూదందాపై ఉక్కుపాదం మోపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో ఏడు జిల్లాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే మంగళవారం 29 మంది సబ్ రిజిస్ట్రార్లు, అధికారులను బదిలీ చేసిన ప్రభు త్వం.. తాజాగా మరో 43 మంది స్థానాలు మార్చింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 72 మంది రిజిస్ట్రార్ల స్థానచలనం గతంలో కనీవినీ ఎరుగని పరిణామమని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి పట్టణ ప్రాంతాల్లో తిష్ఠవేసుకుని ఉన్న చాలా మంది అధికారులను గ్రామీణ ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో పల్లె ప్రాంతాల్లో ఇప్పటివరకు మెరుగైన సేవలందించినవారికి కీలక పోస్టులు అప్పగించారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వారి నివాసాల్లో పెద్దఎత్తున సోదాలు ప్రారంభించారు. డాక్యుమెంట్ల పరిశీలన, సాంపుడ్యూటీ, విలువ, వేలిముద్రలతో జరిగిన రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల అప్‌లోడ్ ఏ స్థాయిలో ఉంది? తదితర అంశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలతో ఏసీబీ అధికారులు ఒక పట్టికను రూపొందించారు. తాము సోదాలు జరిపిన కార్యాలయాల్లో అమలవుతున్న విధి విధానాలు తాము తయారుచేసిన పట్టికతో సరిపోలుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here