ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిలో మూడేండ్ల పెంపు

0
6

తెలంగాణ: పోలీస్ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని మూడేండ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ఠ వయోపరిమితి 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు, ఎస్సై ఉద్యోగానికి గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్ల నుంచి 28 ఏండ్లకు పెంచారు. మొత్తం 18,428 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) మే 31 భారీ నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీస్‌శాఖతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో భర్తీచేయనున్న పోస్టులన్నింటికీ ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 18,428 పోస్టులకు సంబంధించి 2018లో జారీచేసిన నాలుగు నోటిఫికేషన్లతోపాటు 2019 మే 30 వరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టే పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు ఈ నిబంధన అమలవుతుందని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగార్థుల నుంచి గరిష్ఠ వయోపరిమితి పెంపుపై వచ్చిన అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వీలైనంత ఎక్కువమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా గరిష్ఠ వయోపరిమితిని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఇచ్చిన నోటిఫికేషన్‌లోనూ నాలుగేండ్ల సడలింపు ఇచ్చింది. కొత్త రాష్ట్రం ఏర్పడడం, చాలాకాలంగా ఉద్యోగ ప్రకటనలు లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సడలింపు ఇచ్చారు. వయోపరిమితిని మూడేండ్లు పెంచడంపై నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తం అవుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here