ఎన్నికల సంస్కరణలు అత్యవసరం

0
15

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థకు సంస్కరణలు అత్యవసరమని, ఎన్నికల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అవినీతిని కఠినంగా అణిచివేయాల్సి ఉంది.. తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వారికి 90 రోజుల్లో శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలి.. దేశంలో ఎన్నికైన ప్రతినిధులు శాశ్వతం కాదు, ప్రతినిధులను ఎన్నుకునే ప్రజలే శాశ్వతంగా ఉంటారు అని గవర్నర్ అన్నారు. తాను గవర్నర్‌గా కాకుండా దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు.

బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పదని, అందులో ఉన్న సరళత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని వక్రమార్గాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు అనేది ప్రతివ్యక్తి ప్రాథమిక హక్కుగా భావించి, పరిణతితో ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయండి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించండి.. ఓటు వేసేందుకు ముందుకు రండి.. దేశ భవిష్యత్‌ను నిర్ణయించండి అంటూ గవర్నర్ నరసింహన్ భావోద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ పర్యటించి ఓటు నమోదు, ఓటు వేయడంపై అవగాహన, చైతన్య సదస్సులు పెట్టామని వివరించారు. తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను మరింతగా విస్తృతం చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించే దినంగా ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలురకాల పోటీల్లో విజేతలకు గవర్నర్ నరసింహన్ బహుమతులను అందించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ సచివాలయ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు.

LEAVE A REPLY