ఎన్టీఆర్‌కు ‘దానవీర శూరకర్ణ’… బాలకృష్ణకు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

0
25

‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి లాంటిది. తెలుగువారికి తెలియని తెలుగు వీరుణ్ని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకుడు క్రిష్‌. ఎన్టీఆర్‌ ‘దాన వీర శూర కర్ణ’గా ప్రేక్షకులకు ఎలా గుర్తుండిపోయారో… బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా అలాగే గుర్తుండిపోతారు. ‘గౌతమిపుత్ర..’ భావితరాలకు ఓ పాఠ్యాంశంలా నిలుస్తుంద’’న్నారు టి.సుబ్బరామిరెడ్డి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయవంతమైన సందర్భంగా చిత్ర కథానాయకుడు బాలకృష్ణతో పాటు చిత్రబృందాన్ని హైదరాబాద్‌లో సన్మానించారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘గౌతమిపుత్ర..’లో టైటిల్‌ పాత్ర పోషించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారి ఆశీస్సులతోనే ఇలాంటి విజయంలో భాగస్వామినయ్యే అవకాశం లభించింది. నాన్న శాతకర్ణుడి చరిత్రను సినిమాగా తీద్దామనుకున్నారు…అలాంటిది ఆ సినిమాలో నేను నటించడం గర్వంగా ఉంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. కళల్ని ప్రోత్సహిస్తున్న సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు’’అని చెప్పారు. ‘‘సినిమా విజయం సాధించినదానికంటే ఓ తెలుగువాడి ఘన చరిత్రను తెరెకెక్కించినందుకు నన్ను అందరూ మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. బాలకృష్ణ నటించిన 99 చిత్రాలు ఒకెత్తు… ఈ వందో చిత్రంలో ఆయన నట విశ్వరూపం మరో ఎత్తు. ఈ సినిమా విజయం మొత్తం బాలకృష్ణగారికే చెందుతుంది. తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణగారి వేలిముద్ర ఈ చిత్రం’’అని చెప్పారు క్రిష్‌. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌, కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కోదండరామిరెడ్డి, మంచు విష్ణు, మంచు మనోజ్‌, శుభలేఖ సుధాకర్‌, తమన్నా, జయసుధ, వసుంధర, రమ్య, బ్రాహ్మణి, తేజస్విని, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్‌, బుర్రా సాయిమాధవ్‌, చిరంతన్‌ భట్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here