ఎన్జీటీ ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసిన హైకోర్టు

0
22

తెలంగాణ: దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగించడానికి మంగళవారం హైకోర్టు అనుమతించింది. అటవీ సంరక్షణ, పర్యావరణ విభాగాల అనుమతులు లేని కారణంగా ప్రాజెక్టు పనులను ఈ నెల 17 వరకు నిలిపివేయాలంటూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సదరన్ రీజియన్ బెంచ్ జారీచేసిన ఏకపక్ష (ఎక్స్‌పార్టీ) మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే ఈ నెల 17 వ తేదీన చెన్నై ఎన్జీటీ బెంచ్ ఎదుట జరుగబోయే విచారణకు హాజరై ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షరతు విధించింది. ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ హర్షవర్ధన్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ప్రతివాది అయిన తెలంగాణ రాష్ర్టానికి నోటీసులు జారీచేయకుండా, రాష్ట్ర వాదనలు వినకుండానే ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి పనులను కొనసాగించడానికి వీల్లేదంటూ గత ఏడాది డిసెంబర్ 13 వ తేదీన ఎన్జీటీ ఏకపక్షంగా నిషేధపు ఉత్తర్వులు (యాడ్ ఇంటెరిమ్ ఇన్‌జెంక్షన్) జారీచేయడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది.

LEAVE A REPLY