ఊపిరి ఆపిన నిర్లక్ష్యం?

0
36

ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు పనిచేయడం లేదని సిబ్బంది ముందే సమాచారం ఇచ్చినా సకాలంలో చర్యలు తీసుకోలేదా? అధికారుల ఈ నిర్లక్ష్యమే రోగుల ఉసురు తీసిందా? ఉస్మానియా ఆస్పత్రి అధికారులపై ఇప్పుడు ఇవే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్‌ అందని కారణంగానే మంగళవారం ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో మంగళవారం ఓపీ బ్లాక్‌లోని అక్యూట్‌ న్యూరో సర్జికల్‌ కేర్‌ యూనిట్‌ (ఎఎన్‌ఎ్‌ససీ)లో చికిత్స పొందుతున్న ఫర్హానా (5), లక్ష్మణ్‌ (14), జె.రాజు (28), ముషీరా (20), మరో రోగి మరణించారు. వీరంతా ఆక్సిజన్‌ అందకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని సమాచారం. మరోవైపు ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదని ఉస్మానియా ఆస్పత్రి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సర్జికల్‌, క్రిటికల్‌, న్యూరో సర్జికల్‌ తదితర అత్యవసర వార్డులను సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇందుకు ఆస్పత్రి పాత భవనం సమీపంలో ఆక్సిజన్‌ ఫ్లాంట్‌ను నెలకొల్పారు. కాగా అక్యూట్‌ న్యూరో సర్జికల్‌ కేర్‌ యూనిట్‌ (హెడ్‌ ఇంజూరీ వార్డు)లో ప్రతి పడకకు ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు, పైపులు ఏర్పాటుచేసి రోగులకు అక్సిజన్‌ అందిస్తున్నారు. అయితే ఈ వార్డులో ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు సరిగ్గా పనిచేయడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి వైద్య సిబ్బంది తీసుకకెళ్లారు. మంగళవారం కూడా ఇదే అంశం వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. ఓపిక నశించిన సిబ్బంది.. ఫ్లో మీటర్లు సరిగా పనిచేయడం లేదని, రోగులకు ఆక్సిజన్‌ అందించలేకపోతున్నామని, వారు చనిపోయిన తర్వాత సరిచేస్తారా? అంటూ అధికారులపై మండిపడినట్లు తెలిసింది. దీంతో అధికారులు స్పందించి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అయితే ప్లాంట్‌ నుంచి అన్నిచోట్లకు ఆక్సిజన్‌ సరఫరా జరుగుతుందని, కొన్ని పడకలకు పంపిణీ కాకపోతే అది ఫ్లో మీటర్ల పరికరాల్లో లోపమేనని, వాటిని సరిచేసుకోవాల్సిందిగా అధికారులకు ఆపరేటర్‌ సూచించినట్లు తెలిసింది. కాగా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేక ఏ ఒక్క రోగి చనిపోలేదని ఆర్‌ఎంవో మహ్మద్‌ రఫీ తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో కొందరికి తలకు బలమైన గాయాలు తగలడం, మరికొందరు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది, చివరి సమయంలో ఉస్మానియాకు రావడంవల్ల బతికించలేకపోయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here