ఉరిశిక్షపై అప్పీలుకు 60 రోజుల గడువు

0
29

గూఢచర్యానికి పాల్పడ్డారన్న అభియోగంతో కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన ఉరిశిక్ష విషయమై భారత్‌తోపాటు అంతర్జాతీయంగా అన్ని వైపులా ఒత్తిళ్లు రావడంతో పాకిస్థాన్ వెనుకకు తగ్గినట్లు కనిపిస్తున్నది. పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ జాదవ్ తనకు విధించిన ఉరిశిక్షపై 60 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేయవచ్చునని అన్నారు. కుల్‌భూషణ్‌పై తాము చట్ట ప్రకారమే ముందుకు వెళుతున్నామని తెలిపారు. తమ వైఖరి సమర్థనీయమేనని స్పష్టం చేశారు. పథకం ప్రకారం జాదవ్ హత్యకు కుట్ర పన్నారన్న భారత్ ఆరోపణను ఆయన కొట్టి పారేశారు. కాగా, కుల్‌భూషణ్ జాదవ్‌ను ఉరితీస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బుధవారం పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఖ్వామర్ జావెద్ బజ్వా సమావేశమై జాదవ్‌కు విధించిన ఉరిశిక్షపై ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని నిర్ణయించినట్లు సమాచారం. కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐక్యరాజ్య సమితి (ఐరాస), అమెరికా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలే కోరారు. పాకిస్థాన్ నిర్ణయం అమానవీయంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here