ఈ ‘చిరు’ విరామంలో ఎవరెన్ని సినిమాలు

0
28

చిరంజీవి సినిమా అంటే అభిమానులకు సంక్రాంతి పండుగ వచ్చినట్లే. బాస్‌ వెండితెరపై కనిపిస్తే రికార్డుల బాక్సులు బద్ధలవ్వాల్సిందే. అభిమానులు మెగాస్టార్‌ అని పిలుచుకునే చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా అంటే పరుగు పందెంలాంటిది. కాస్త విరామం ఇచ్చినా తోటి నటులు దూసుకెళ్లిపోతారు. అయితే అక్కడక్కడ పలకరించే అపజయాల ఎదురుదెబ్బలను తట్టుకుని కెరీర్‌లో ముందుకు వెళ్లే వాడే విజేతగా నిలుస్తాడు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కారణంగా గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సమకాలీన నటులు, పలువురు యువ నటులు తమదైన సినిమాలతో ముందుకు దూసుకుపోయారు. వీరిలో చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా ఉన్నారు. తొమ్మిదేళ్ల ‘చిరు’ విరామంలో ఆయన సమకాలీకుడైన బాలకృష్ణ 12 చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఆయన తన కెరీర్‌లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ద్వారా 100వ చిత్ర మైలురాయిని అందుకున్నారు. ఇక నాగార్జునా అయితే దాదాపు 15 చిత్రాల్లో(అతిథి పాత్రలతో కలిపి) నటించారు. త్వరలో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరో హీరో వెంకటేష్‌ 11 చిత్రాల్లో నటించారు. తాజాగా ‘సాలా ఖడూస్‌’ రీమేక్‌లో నటిస్తూ ‘గురు’గా రాబోతున్నారు. మహేష్‌బాబు 8, పవన్‌కల్యాణ్‌ 9, అల్లు అర్జున్‌ 11, రామ్‌చరణ్‌ 9, ఎన్టీఆర్‌ 12, రవితేజ 18 , ప్రభాస్‌ 10 చిత్రాల్లో నటించగా.. నేచురల్‌ స్టార్‌ నాని ఏకంగా 20కు పైగా చిత్రాల్లో  (అతిథి పాత్రల్లో కలిపి) నటించడం విశేషం. ఇక తమిళ అగ్రకథానాయకులు రజనీకాంత్‌ 5, కమల్‌ హాసన్‌ 8 చిత్రాల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here