ఈసారి జీడీపీ @ 6.9 శాతం

0
47

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలంపాటు తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంటున్నది. ఈ పరిణామ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) వృద్ధిరేటు 6.9 శాతానికి తగ్గవచ్చని అంచనా వేస్తున్నది. గతంలో విడుదల చేసిన నివేదికలో 7.4 శాతంగా అంచనా వేసింది. చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 86 శాతం వాటా ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడిన ద్రవ్య కొరత కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక లావాదేవీలు భారీగా తగ్గనున్నాయని ఫిచ్ అంటున్నది. ఈ ఏడాదితోపాటు వచ్చే రెండేండ్ల వృద్ధిరేటును సైతం సవరించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతంగా నమోదుకావచ్చని, 2018-19లో 8 శాతంగా ఉండొచ్చని తాజాగా విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు సన్నగిల్లాయని ఫిచ్ పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో వినియోగదారులు చేతిలో తగినంత సొమ్ము లేక కొనుగోళ్లు జరుపలేకపోతున్నారని, రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారని ఏజెన్సీ అంటున్నది. అంతేకాదు జనాలు డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు వరుసలో నిల్చోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయని, ఫలితంగా ఈమధ్యకాలంలో ఉత్పాదకత కూడా గణనీయంగా తగ్గిందని, మరిన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే వృద్ధిపై అధిక ప్రభావం పడనుందని ఫిచ్ హెచ్చరించింది. నోట్ల రద్దుతో వృద్ధిరేటుపై మధ్యకాలిక ప్రభావం ఏమేర ఉంటుందన్న విషయంలో అనిశ్చితి నెలకొందని ఫిచ్ అంటున్నది. అయితే తీవ్ర స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. నల్లధనాన్ని నియంత్రించడానికి కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. అయినప్పటికీ అసంఘటిత రంగాలకు చెందినవారు రూ. 2000 నోట్లు లేదా బంగారం రూపంలో మళ్లీ సొమ్మును దాచిపెట్టుకునే అవకాశం ఉందని సంస్థ భావిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here