ఇదే తెలంగాణ మార్గం

0
14

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచి, వ్యవసాయరంగాన్ని రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దే రీతిలో దేశవ్యాప్తంగా ఒకే వ్యవసాయ విధానం అమలు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రానికి సూచించనున్నారు. ఇందుకు తెలంగాణ అనుసరిస్తున్న మార్గాన్ని వివరిస్తూ.. వ్యవసాయాభివృద్ధికి, రైతులకు చేయూతనందించేందుకు కేంద్రం మరింత ముందుకు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనున్నారు. నాట్లు వేసే దశనుంచి పంట అమ్మేదాక అన్ని దశల్లో ప్రభుత్వం చేయూతనిచ్చినపుడే రైతులు నిలదొక్కుకుంటారని, రుణభారం తగ్గి రైతుల ఆత్మహత్యలు నిలిచిపోతాయని సూచించనున్నారు. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ వ్యవసాయాభివృద్ధిపై తన విజన్‌ను వివరించనున్నారు. గ్రామస్థాయినుంచి జాతీయస్థాయిదాకా ప్రభుత్వమే రైతుసంఘాలను ఏర్పాటు చేసి వాటి అవసరాలకు జవాబుదారీగా ఉండాలని కోరనున్నారు.

భూసా రం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసే విధానం రావాలని, దిగుమతులు అవసరం లేకుండా దేశ అవసరాలకు సరిపోయే ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగాలని సూచించనున్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 9 గంటల ఉచిత విద్యుత్, రెండు పంటలకు ఉచిత ఎరువులు, రైతు సంఘాల ఏర్పాటు, రైతు రుణమాఫీ అంశాల్లో చేసిన కృషితోపాటు అనుబంధ రంగాలుగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, గొర్రెల పంపిణీ పథకాలను ప్రస్తావించనున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ మెజారిటీ గ్రామాల్లోనే నివసిస్తూ ఉండటం, వ్యవసాయంతో పాటు చేతివృత్తులు, కులవృత్తులనే నమ్ముకుని జీవిస్తూ ఉండటం ప్రస్తావించి, ఇకపైన గ్రామీణ భారత వ్యవస్థను మరింతగా ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలపై వివరించనున్నారు.

LEAVE A REPLY