ఇది మరో చంటిగాడి ప్రేమకథ

0
37

షాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోగ్‌’. మరో చంటిగాడి ప్రేమకథ ఉపశీర్షిక. మన్నారా చోప్రా, ఎంజెలా నాయికలు. సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని సి.ఆర్‌. మనోహర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పూరి హస్తవాసి మంచిది. ఆయన చేతుల మీదుగానే ఇషాన్‌ని పరిచయం చేద్దామనుకొన్నాం. ఇషాన్‌ ఫొటో చూసిన మర్నాడే పూరి కథ కూడా చెప్పేశారు. అన్ని వర్గాల్ని ఆకట్టుకొనేలా రూపొందించారు. ఇషాన్‌ని హిందీలోనూ హీరోని చేస్తానంటున్నారాయన. ఇప్పటికే ‘రోగ్‌’ని నాలుగు సార్లు చూశా. అంతలా నచ్చింది. సాంకేతికంగానూ ఈ సినిమా చాలా బాగా వచ్చింద’’న్నారు. పూరి చెబుతూ ‘‘నేను చాలా రోజుల తర్వాత తెరకెక్కించిన ప్రేమకథ. ఒకరకంగా మరో చంటిగాడి ప్రేమకథ. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తరహాలో ఉంటుంది. ఇషాన్‌ బెరుకు లేకుండా పాత్రలో ఇమిడిపోయాడు. కచ్చితంగా పెద్ద స్టార్‌ అవుతాడు. బ్యాంకాక్‌లో చిత్రీకరించేప్పుడు ఇషాన్‌ని చూసి అక్కడివాళ్లు ‘అమితాబ్‌..’ అంటూ కేకలేశారు. త్వరలో ఆడియోను విడుదల చేస్తామ’’న్నారు. ఇషాన్‌ మాట్లాడుతూ ‘‘సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. మా అన్నయ్య మనోహర్‌ లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్ని కాను. పూరిగారైతే నన్ను తన కొడుకులా చూసుకున్నార’’న్నాడు. ‘‘సంగీతాభిరుచి ఉన్న పూరితో చేయడం ఓ చక్కటి అనుభవం’’అన్నారు సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్‌. ‘‘ఇషాన్‌ పెద్ద హీరో అవుతాడు. సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంద’’ని గీత రచయిత భాస్కరభట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో అలీ, జి. ముఖేష్‌, జునైద్‌ సిద్ధిఖి, వెంకట్‌, జానీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here