ఇండోనేషియాలో భారీ భూకంపం 200 మంది క్షతగాత్రులయ్యారు

0
28

ఇండోనేషియాలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ప్రధానంగా ముస్లింలు అత్యధికంగా జీవించే సుమత్రా దీవిపై గల ఏసె రాష్ట్రంలోని పిడైజయ జిల్లా పరిధిలో బుధవారం తెల్లవారుజామున 5.03 గంటలకు పౌరులు ఉదయం ప్రార్థనలకు సిద్ధమవుతున్న తరుణంలో సంభవించిన భూ ప్రకంపనలతో 97 మంది మృతి చెందగా, మరో 200 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వందల కొద్ది ఇండ్లు, మసీదులు, వాణిజ్య సముదాయాలు పేకమేడల్లా కుప్పకూలాయి. పిడైజయ పొరుగు జిల్లా బిరైన్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ప్రకంపనలతో మైరైడు పట్టణం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రజలు భయాందోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. పిడైజయ జిల్లాకు నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఇండోనేషియాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5 ఉంటుందని అమెరికా భౌగోళిక సంస్థ పేర్కొంది. భవనాల శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు లభించే అవకాశముందని ఏసె మిలిటరీ చీఫ్ తతాంగ్ సులేమాన్ చెప్పారు. మేం ఒక్కోసారి ఐదు, పది మృతదేహాలు వెలికితీస్తున్నాం అని ఆయన అన్నారు. వెయ్యి మందికి పైగా ఆర్మీ జవాన్లు, 900 మంది పోలీస్ కానిస్టేబుళ్లు సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు.

LEAVE A REPLY