ఆ ప్రాజెక్టు ట్రెండ్‌ సెట్టర్‌!

0
19

అమరావతి, పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా భావిస్తున్న అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారిని రెండేళ్లలో పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీని నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్‌ వేతో సంబంధమున్న ఐదు జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఈ రహదారి ఎంతో కీలకమవుతుందని చెప్పారు. రూ.27,600 కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టు దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తొలుత ఆరు వరుసల రహదారి నిర్మిస్తున్నా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది వరుసల రహదారికి అవసరమయ్యేటట్లు భూసమీకరణ/సేకరణ చేయాలని, ఇది కూడా 6 నెలల్లో పూర్తికావాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘యూపీలో ఇటీవల ఈ తరహా రహదారి నిర్మించారు. కానీ దానికి ఇది భిన్నంగా ఉంటుంది. అక్కడ నాలుగు వరుసలతో 300 కి.మీ. మేర నిర్మిస్తే… ఇది ఆరు లేన్లతో 598 కి.మీ మేర నిర్మాణం కానుంది. ఎక్కడా మలుపులు లేకుండా మధ్యమధ్యలో సొరంగ మార్గాలు, వంతెనలతో నిర్మించడం దేశంలో ఇదే ప్రథమం. దీనికి సమాంతరంగా రైల్వే ట్రాక్‌ కూడా నిర్మిస్తుండడం అదనపు ఆకర్షణ. ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. నిర్మాణ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నాం. శుక్రవారం నుంచే సర్వే బృందాలను పంపుతాం’ అని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్నే మార్చేస్తుందని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు.

LEAVE A REPLY