ఆ క్షురకుడి కలెక్షన్లలో మేబ్యాచ్

0
34

ఆయన వృత్తి క్షవరం చేయడం.. ప్రవృత్తి ఖరీదైన కార్లను కొని కిరాయికి తిప్పటం. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన రమేశ్‌బాబు రోజుకు ఐదు గంటలపాటు తన క్షవరశాలలో పని చేస్తుంటారు. దానికే ఆయన పరిమితం కారు. రోల్స్‌రాయిస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి ఖరీదైన కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మరీ అద్దెకు ఇస్తుంటారు. ఆయన ఇటీవల మెర్సిడెజ్-మేబ్యాచ్ కారును కొని జర్మనీ నుంచి తెప్పించుకున్నారు. ఆ కారు ఖరీదు రూ.3 కోట్ల పైమాటే. బెంగళూరులో మెర్సిడెజ్-మేబ్యాచ్ కారు ఇప్పటివరకూ ఇద్దరి వద్ద మాత్రమే ఉంది. ఒకరు విజయ్‌మాల్యా కాగా మరొకరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రస్తుతం ఈ జాబితాలో మూడోవ్యక్తిగా రమేశ్‌బాబు చేరారు. ఆయన వద్ద ఇప్పటికే ఒక రోల్స్‌రాయిస్,11 మెర్సిడెజ్‌లు, 10 బీఎండబ్ల్యూలు, మూడు ఆడీలు, రెండు జాగ్వార్ కార్లున్నాయి. రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్లను ఆయన కిరాయికి నడిపిస్తుంటారు. ఇన్ని రూ.కోట్ల విలువైన కార్లతో ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తూనే తన మూలాలను మర్చిపోకుండా క్షవరశాలలో క్షురకుడిగా సేవలందిస్తున్నారు రమేశ్. కటింగ్‌కు వచ్చే ఒక్కో వ్యక్తి నుంచి ఆయన రూ.75 మాత్రమే తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here