ఆ కథకు కాజల్ అగర్వాల్ కరెక్ట్ అనిపించింది!

0
27

దర్శకుడు వంశీ కోసమే చేసిన చిత్రమిది. నా గత చిత్రాలకు చాలా భిన్నంగా మరింత గ్లామరస్‌గా కనిపిస్తాను. ఫారిన్ నుంచి పల్లెటూరు వచ్చిన అమ్మాయిగా ఎక్కువగా మోడ్రన్ దుస్తుల్లోనే కనిపిస్తాను. తెరపై నా పాత్రను చూసిన ప్రతి ఒక్కరు షాక్‌కు గురవుతారు అని తెలిపింది అనీషా ఆంబ్రోస్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్. సుమంత్ అశ్విన్ కథానాయకుడు. వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం అనీషా ఆంబ్రోస్ హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ అమెరికాలో పుట్టిపెరిగిన యువతిగా కనిపిస్తాను. గ్రామీణ వాతావరణం అంటే అమితంగా ఇష్టపడే ఆ యువతి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చీరకట్టులో కనిపించాలని తాపత్రయపడుతుంటుంది.

నేను నటించిన గత చిత్రాలకు భిన్నంగా వుండే పాత్ర ఇది. వంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లేడీస్ టైలర్ కొడుకు కథ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. లేడీస్ టైలర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు వున్నాయి. సినిమాలో నాపై చిత్రీకరించిన క్లాసికల్ గీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని తెలిపింది. సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో కథానాయికగా అవకాశం చేజారడానికి కారణాన్ని వివరిస్తూ నేను ఆ సినిమా మిస్ కాలేదు కానీ ఆ కథకు కాజల్ అగర్వాల్ అయితేనే కరెక్ట్ అనిపించింది. పైగా పవన్‌కల్యాణ్‌తో కలిసి తొలిసారి పనిచేయాలంటే నా లాంటి వారికి సహజంగానే ఒత్తిడి వుంటుంది. దాన్ని తట్టుకుని చేయడం కష్టంగా భావించి ఆ సినిమా నుంచి నేనే తప్పుకున్నాను. అందుకు నాకు ఎలాంటి బాధలేదు. నాకు ఏ పాత్ర కుదురుతుందో అలాంటి పాత్రలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాను. ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటిస్తున్నాను. దీనితో పాటు తమిళంలో ఇటీవలే ఓ చిత్రాన్ని అంగీకరించాను అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here