‘రాష్ట్ర విభజన వల్ల కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునే విధానాలను అమలు చేయాలి. తెలంగాణకంటే మన రాష్ట్ర జనాభా ఎక్కువ. మార్కెట్ పెద్దది. కానీ పన్నుల వసూళ్లలో మనం ఇంకా వెనుకే ఉన్నాం. రాష్ట్ర విభజనతో సేవల రంగంలో వెనుకబడిపోయాం. దానిని అఽధిగమించాలి. పన్ను ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్కంటే ముందున్న రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను, పన్నుల తీరును అధ్యయనం చేయండి. రెవెన్యూ వృద్ధి రేటులో రాష్ట్ర సగటు కంటే వెనుక ఉన్న జిల్లాలపై దృష్టి సారించండి. వృద్ధి రేటు మందగమనంపై అధ్యయనం చేయండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన ఏడు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫలితాలను సమీక్షించారు.