అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్ల‌ర్‌స‌న్

0
17

అమెరికా విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్ల‌ర్‌స‌న్ దాదాపు ఖ‌రార‌య్యారు. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ టీమ్‌లో టిల్ల‌ర్‌స‌న్ విదేశాంగ వ్య‌వ‌హారాల‌ను చూసుకోనున్నారు. ర‌ష్యాతో టిల్ల‌ర్‌స‌న్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నా, విదేశాంగ శాఖ ఆయ‌న‌నే వ‌రించే ఛాన్సు ఉంది. విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌ను ఎవ‌రికి ఇవ్వాల‌న్న దానిపై విదేశీ సంబంధాల సేనేట్ క‌మిటీ సోమవారం స‌మావేశ‌మైంది. ఆ క‌మిటీ టిల్ల‌ర్‌స‌న్‌కు ఆమోదం తెలిపింది. క‌మిటీలో ఉన్న స‌భ్యుల్లో 11 మంది రిప‌బ్లిక‌న్లు అనుకూలంగా ఓటేశారు. 10 మంది డెమోక్రాట్లు మాత్రం వ్య‌తిరేకంగా ఓటేశారు. మ‌రోవైపు అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆసియాతో వాణిజ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ ప‌సిఫిక్ భాగ‌స్వామ్యా ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎక్సిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేశారు. 12 ఆసియా దేశాల‌తో వాణిజ్యం కోసం ట్రాన్స్ ప‌సిఫిక్ ఒప్పందాన్ని గ‌తంలో బ‌రాక్ ఒబామా కుదుర్చుకున్నారు. అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొన్ని రోజుల్లోనే ట్రంప్ మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. అబార్ష‌న్ల‌ను ప్రోత్స‌హించే అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు నిధులు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేట్ అధికారుల‌తో స‌మావేశ‌మైన ట్రంప్ ఔట్‌సోర్సింగ్ చేసిన కంపెనీల‌పై ప‌న్నులు విధించేందుకు నిర్ణ‌యించారు. నెట్ న్యూట్రాలిటీని వ్య‌తిరేకించే అజిత్ పాయ్‌కి ఫెడ‌ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ క‌మీష‌న్ అధికారిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సుప్రీంకోర్టుకు కొత్త న్యాయ‌మూర్తిని రెండు వారాల్లోగా నియ‌మిస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. సీఐఏ డైర‌క్ట‌ర్‌గా మైక్ పోంపియో నియామ‌కాన్ని సేనేట్ దృవీక‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here